మాకు బాగుండటం ఏముంటుంది: కేఎల్‌ రాహుల్‌

27 Apr, 2021 07:23 IST|Sakshi

అహ్మదాబాద్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమిపాలవడంపై ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్‌.. ఓటమి చెందిన జట్టుకు మంచి, బాగు అంటూ ఏమీ ఉండదని తాము ఆడిన తీరుపై అసహనం ప్రదర్శించాడు. ఈ తరహా ప్రదర్శన గురించి ఏమి మాట్లాడాలో తెలియడం లేదని, ఇంకా తాము చాలా మెరుగుపడాలన్నాడు.  

ప్రధానంగా బ్యాటింగ్‌లో ఎంతో నాణ్యమైన ఆటను ప్రదర్శించాలన్నాడు. కొన్ని సాఫ్ట్‌ డిస్మిసల్స్‌ తమ గేమ్‌పై ప్రభావం చూపాయన్నాడు. ఇక్కడ రిస్క్‌ చేసి షాట్లు కొట్టడం చాలా కష్టంగా ఉందన్నాడు. మంచి జట్లు ఇక్కడ పరిస్థితులను తొందరగా అర్థం చేసుకుంటాయన్నాడు. బిష్ణోయ్‌ ఒక స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టాడని, తమ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ వల్లే ఈ తరహా క్యాచ్‌లు పడుతున్నామన్నాడు. జాంటీ తమకు కఠినమైన పరీక్షలు పెడుతుంటాడని వాటికి తాము ఎలా రియాక్ట్‌ అవుతామనే దాన్ని చూసి ఫీల్డింగ్‌ సరిచేస్తూ ఉంటాడన్నాడు. తాము తిరిగి సమష్టిగా రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు రాహుల్‌.

కాగా, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత  మరో విజయాన్ని కేకేఆర్‌ సాధించింది.. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ 47 పరుగులు నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. త్రిపాఠి 41 పరుగులతో ఆ‍కట్టుకున్నాడు.

మరిన్ని వార్తలు