సిరాజ్ మొత్తం మారిపోయాడు: కోహ్లి

19 Apr, 2021 00:35 IST|Sakshi

చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఆర్సీబీ బౌలర్‌ మ‌హ్మద్‌ సిరాజ్‌పై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం చూస్తున్న సిరాజ్‌కు గత సిరాజ్‌కు చాలా వ్యత్యాసం ఉందన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సిరాజ్‌ బౌలింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయన్నాడు. గేమ్‌కు తగ్గట్టు బౌలింగ్‌ చేస్తూ కీలక బౌలర్‌గా ఎదిగిపోయాడన్నాడని కోహ్లి పేర్కొన్నాడు. ప్రధానంగా కేకేఆర్‌ హార్డ్‌ హిట్టర్‌ రసెల్‌కు వేసిన ఓవర్‌ను ప్రస్తావిస్తూ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడన్నాడు. 

రసెల్‌తో పోరులో సిరాజ్‌కు ఎప్పుడూ మంచి రికార్డే ఉందన్న విషయాన్ని గుర్తుచేశాడు. ఇక ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడానికి ఆ ముగ్గురూ ప్రత్యేకమైన బౌలర్లు కావడమేనని ఆర్సీబీ కెప్టెన్‌ వెల్లడించాడు. దానికి తగ్గట్టే వారు (సిరాజ్‌, హర్షల్ పటేల్‌, జెమీసన్‌) బౌలింగ్‌ చేశారని కొనియాడాడు. ఇక మ్యాక్స్‌వెల్‌, ఏబీ బ్యాటింగ్‌లను ప్రత్యేకంగా కొనియాడిన కోహ్లి... మ్యాక్సీ సెట్‌ చేసి ఔటైతే, దాన్ని ఏబీ కొనసాగించాడని చెప్పుకొచ్చాడు. ఏబీ ఫామ్‌లోకి వస్తే అతన్ని ఆపడం చాలా కష్టమని గుర్తు చేశాడు. ఈ పిచ్‌పై తమకు 40 పరుగులు అదనంగా వచ్చాయని కోహ్లి తెలిపాడు. మ్యాక్సీ తన సామర్థ్యాన్ని చాటడానికి ఆర్సీబీలోకి రావడం ఆనందంగా ఉందని చెప్పాడు.

మరిన్ని వార్తలు