వారిని చూస్తే బాధేస్తోంది.. కానీ ఏం చేయలేని పరిస్థితి

4 May, 2021 18:14 IST|Sakshi

లండన్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో స్వదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు లేకపోవచ్చుగానీ.. విదేశీ ఆటగాళ్లు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లలో ఆసీస్‌కే చెందినవారు ఎక్కువగా ఉన్నారు. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, పాట్‌ కమిన్స్‌, వోక్స్‌, జోస్‌ బట్లర్‌తో పాటు విండీస్‌ క్రికెటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్‌లోలో కరోనా విజృంభిస్తున్న కారణంగా ఆస్ట్రేలియా ఏప్రిల్‌ 15వరకు విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. యూకే కూడా ఇండియాను రెడ్‌లిస్ట్‌లో పెట్టింది. ఏప్రిల్‌ 22 నుంచి ఆ దేశం మీదుగా ఒక్క విమానం కూడా రావడం లేదు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.' బీసీసీఐ తీసుకున్న ఐపీఎల్‌ రద్దు అనే నిర్ణయం ప్రస్తుతం సున్నిత అంశంగా కనిపిస్తుంది. బయోబబూల్‌లో ఉంటూ ఆటగాళ్లకు రక్షణ కల్పిస్తున్నా.. కరోనా మహమ్మారి ఐపీఎల్‌లోకి కూడా ఎంటరైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం సరైనదే. అయితే లీగ్‌ రద్దు వల్ల స్వదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు లేకపోయినా.. విదేశీ ఆటగాళ్లకు మాత్రం కష్టాలు తప్పేలా లేవు. భారత్‌ నుంచి విదేశాలకు విమానాల రాకపోకల నిషేధం కొనసాగుతుండడంతో ఏం చేయలేని పరిస్థితి. ఆటగాళ్ల భద్రత మాకు ముఖ్యమని.. విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు పంపే బాధ్యత మాది అని బీసీసీఐ చెబుతుంది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. అని చెప్పుకొచ్చాడు.

మరో మాజీ ఆటగాడు మహ్మద్‌ అజారుద్దీన్‌ కూడా ట్విటర్‌లో స్పందించాడు. '' బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే. పటిష్టమైన బయోబబుల్‌లోకి కరోనా మహమ్మారి వచ్చేసింది. ఇప్పటికే నలుగురు ఆటగాళ్లతో పాటు సిబ్బంది కూడా కరోనా బారీన పడ్డారు. లీగ్‌ ఇలాగే కొనసాగితే కేసులు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని నియంత్రించేందుకే బీసీసీఐ ఐపీఎల్‌ రద్దు నిర్ణయం తీసుకుంది. కరోనా ఉదృతి తగ్గాకా మళ్లీ ఐపీఎల్‌ నిర్వహించే అవకాశం ఉంటుందేమో' అని ట్విటర్‌లో అభిప్రాయపడ్డాడు. 
చదవండి: 'ఐపీఎల్‌ రద్దు అని తెలియగానే నా గుండె పగిలింది'

అయోమయంలో ఆసీస్‌ క్రికెటర్ల పరిస్థితి..!

మరిన్ని వార్తలు