Rinku Singh: నాకు ఆ అమ్మాయంటే ఇష్టం.. కానీ పెళ్లి చేసుకోను అన్నట్లు.. ఏంటిది? పాపం రింకూ..

3 May, 2022 12:56 IST|Sakshi
కేకేఆర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌(PC: IPL/BCCI)

IPL 2022 KKR Vs RR- Rinku Singh: రింకూ సింగ్‌ విషయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వైఖరిని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తప్పుబట్టాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రాణిస్తూ జట్టుకు ఉపయోగపడే రింకూ సేవలను ఉపయోగించుకోవడంలో విఫలమైందన్నాడు. మెరుగ్గా రాణించినప్పటికీ అతడిని చాలా మ్యాచ్‌లలో పక్కన పెట్టారని, ఇప్పటికైనా తనపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇవ్వాలని సూచించాడు.

కాగా ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో సోమవారం(మే 2) నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సంజూ శాంసన్‌ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.  ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రేయస్‌ సేనకు ఆదిలోనే భారీ షాకిచ్చాడు రాజస్తాన్‌ యువ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌. ఆరోన్‌ ఫించ్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్‌ బాబా ఇంద్రజిత్‌ సైతం ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(34)తో కలిసి నితీశ్‌ రాణా(48 నాటౌట్‌) కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే, అయ్యర్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో సంజూకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరడంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఇలాంటి సమయంలో ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 42 పరుగులు రాబట్టి కేకేఆర్‌కు సునాయాస విజయం అందించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఫలితాన్ని విశ్లేషించిన కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా రింకూ సింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో అతడికి సరైన అవకాశాలు ఇవ్వలేదంటూ కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌ను విమర్శించాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రిం​కూ సింగ్‌ అద్భుతంగా రాణించాడు. అతడికి పెద్దగా అవకాశాలు రావు.. అయితే వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటాడు.

అదేంటో గానీ.. పాపం అతడు మంచి స్కోర్లు నమోదు చేసినా ఎనిమిది లేదంటే తొమ్మిదో స్థానంలో  ఆడిస్తారు. కేకేఆర్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుందంటే.. ‘‘నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం.. కానీ తనను పెళ్లి చేసుకోలేను. తను నాకు గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రమే.. ఎప్పటికీ భార్య కాలేదు అన్నట్లు! వాళ్లు రింకూను వేలంలో కొంటారు. జట్టులో పెట్టుకుంటారు. కానీ అవకాశాలు ఇవ్వరు. తను బాగా బ్యాటింగ్‌ చేయగలడు.

ఫీల్డింగ్‌ కూడా చేస్తాడు. అయినా, తుది జట్టు నుంచి తప్పిస్తారు. ఒకవేళ ఒక మ్యాచ్‌లో ఆడినా మరో మ్యాచ్‌లో లోయర్‌ ఆర్డర్‌లో పంపిస్తారు. దానికి బదులు అతడికి జట్టులో చోటివ్వకపోవడమే మేలు కదా’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 24 ఏళ్ల రింకూ గనుక రాణించకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌- 47: కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు
రాజస్తాన్‌-152/5 (20)
కేకేఆర్‌- 158/3 (19.1)

చదవండి👉🏾 IPL 2022: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన శాంసన్.. రివ్యూ కోసం సిగ్నల్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు