KKR vs GT: రసెల్‌ చెలరేగినా... ఓటమి తప్పలేదు

24 Apr, 2022 05:51 IST|Sakshi

ముంబై: బౌలింగ్‌లో వేసింది ఒకే ఓవర్‌.. అదీ ఇన్నింగ్స్‌లో చివరిది... చక్కటి నియంత్రణతో బౌలింగ్‌ చేస్తూ 5 పరుగులే ఇచ్చిన అతను ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు... బ్యాటింగ్‌లో 25 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు... ఆండ్రీ రసెల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఇది! అయితే ఇది కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను గెలిపించేందుకు సరిపోలేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 8 పరుగుల తేడాతో నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది.

ముందుగా గుజరాత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (49 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. ఆండ్రీ రసెల్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులే చేయగలిగింది. ఆండ్రీ రసెల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా, రింకూ సింగ్‌ (28 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ (2/22) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.  

టాస్‌ గెలిచిన గుజరాత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇది 35వ మ్యాచ్‌ కాగా...టాస్‌ గెలిచిన కెప్టెన్‌ తొలిసారి బ్యాటింగ్‌ ఎంచుకోవడం విశేషం. గత 34 మ్యాచ్‌లలో టాస్‌ గెలవగానే అన్ని జట్లు ఫీల్డింగ్‌నే తీసుకున్నాయి. గిల్‌ (7) మళ్లీ విఫలం కాగా, సాహా (25 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడలేకపోయాడు. ఈ స్థితిలో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తోనే గుజరాత్‌ కోలుకుంది. 36 బంతుల్లో హార్దిక్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మిల్లర్‌ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతనికి సహకరించాడు. అయితే 18 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన టైటాన్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.

చివరి ఓవర్‌ వేసిన రసెల్‌... అభినవ్‌ మనోహర్, ఫెర్గూసన్, తెవాటియా, యష్‌ దయాళ్‌ వికెట్లు తీశాడు. ఛేదనలో కోల్‌కతా పూర్తిగా తడబడింది. 6.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయిన జట్టు కోలుకోవడం కష్టంగా మారింది. బిల్లింగ్స్‌ (4), నరైన్‌ (5), రాణా (2), శ్రేయస్‌ (12) విఫలమయ్యారు. 47 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన రసెల్‌ వరుస సిక్సర్లతో చెలరేగి కోల్‌కతా విజయావకాశాలు పెంచాడు. అల్జారి చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతినే అతను సిక్సర్‌గా మలచడంతో కేకేఆర్‌ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రసెల్‌ అవుటయ్యాడు.

మరిన్ని వార్తలు