IPL 2022 Auction: 13 ఫోర్లు, సిక్స్‌.. 136 పరుగులు నాటౌట్‌.. శుభమ్‌తో పాటు ఆ ముగ్గురు కూడా! వేలంలో మంచి ధర పలకడం ఖాయం!

27 Dec, 2021 13:11 IST|Sakshi
PC: BCCI

IPL 2022 Auction- Vijay Hazare Trophy Winner Himachal Pradesh Players: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో తొలిసారి చాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించింది హిమాచల్‌ ప్రదేశ్‌. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా విజేతగా నిలిచింది. ఆరుసార్లు చాంపియన్‌ అయిన తమిళనాడుకు షాకిచ్చి ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా కెప్టెన్‌ రిషి ధావన్‌, పంకజ్‌పవన్‌ జైస్వాల్‌, ప్రశాంత్‌ చోప్రా, శుభమ్‌ అరోరా హిమాచల్‌ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించారు.

ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. ఈ నలుగురిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు తప్పక ఆసక్తి కనబరుస్తాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ హజారే ట్రోఫీలో వీరి ప్రయాణాన్ని గమనిద్దాం.

రిషి ధావన్‌(ఆల్‌రౌండర్‌)
విజయ్‌ హజారే ట్రోఫీ ఆసాంతం కెప్టెన్‌గా, బ్యాటర్‌గా.. బౌలర్‌గా రిషి ధావన్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. టోర్నీలో మొత్తంగా 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలతో పాటు ఒక 4 వికెట్‌ హాల్‌ కూడా ఉంది. తాజా ప్రదర్శనతో మెగా వేలం నేపథ్యంలో క్యాష్‌ రిచ్‌లీగ్‌లో రీఎంట్రీ ఇవ్వడంతో పాటు మంచి ధరకు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి.

పంకజ్‌ జైస్వాల్‌
తమిళనాడుతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో హిమాచల్‌ బౌలర్‌ పంకజ్‌ జైస్వాల్‌ కీలక పాత్ర పోషించాడు. 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. టోర్నీలో మొత్తంగా 4 మ్యాచ్‌లు ఆడిన పంకజ్‌ ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

ప్రశాంత్‌ చోప్రా(బ్యాటర్‌)
విజయ్‌ హజారే ట్రోఫీ తాజా సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు ప్రశాంత్‌ చోప్రా. ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 99. మొత్తంగా టోర్నీలో 12 సిక్సర్లు బాదాడు. ఇలాంటి హిట్టర్‌ పట్ల ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేహం లేదు.

శుభమ్‌ అరోరా(బ్యాటర్‌)
ఉత్కంఠ రేపిన ఫైనల్‌లో హిమాచల్‌ ప్రదేశ్ విజేతగా నిలవడంలో శుభమ్‌దే కీలక పాత్ర. మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరిదాకా క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 13 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 136 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. టోర్నీలో మొత్తంగా 313 పరుగులతో రాణించాడు. సగటు 44+.

చదవండి: Virat Kohli Dismissal: 94 బంతులు.. 35 పరుగులు.. మరీ అలా అవుట్‌ అవడం ఏంటి!.. ఫ్రస్ట్రేషన్‌తో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో!

మరిన్ని వార్తలు