IPL 2022 -Lucknow Super Giants : లక్నో సూపర్‌జెయింట్స్‌కు వరుస షాకులు.. మరో ప్లేయర్‌ దూరం!

18 Mar, 2022 14:48 IST|Sakshi

ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆరంభానికి ముందే కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే జేసన్‌ రాయ్‌, అలెక్స్‌ హేల్స్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం ఈ సీజన్‌ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. గాయం కారణంగా ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇంగ్లండ్‌ జట్టు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టెస్టు సందర్భంగా మార్క్‌ వుడ్‌ కుడి మోచేతికి గాయమైంది. ఈ క్రమంలో అతడు ఇంకా కోలుకోనందున ఐపీఎల్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని, ఇంగ్లండ్‌ బోర్డు లక్నో ఫ్రాంఛేజీకి సమాచారం ఇచ్చినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.

ఇక ఐపీఎల్‌-2022 సీజన్‌తో లక్నో జట్టు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లక్నో మెగా వేలంలో భాగంగా మార్క్‌ వుడ్‌ను 7.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక బయో బబుల్‌ నిబంధనల కారణంగా జేసన్‌ రాయ్‌, అలెక్స్‌ హేల్స్‌ దూరం కాగా.. గాయం బారిన పడ్డ మార్క్‌ వుడ్‌ కూడా సీజన్‌ నుంచి తప్పుకోవడంతో లక్నోకు భారీ షాక్‌ తగిలినట్లయింది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో ఘనంగా ఎంట్రీ ఇచ్చే క్రమంలో లక్నో.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. మార్చి 28న మరో కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది.

చదవండి: IPL 2022: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. విలియమ్సన్‌ ఇక..!

మరిన్ని వార్తలు