Rishabh Pant: ఒత్తిడి సమస్యే కాదు.. మా ఓటమికి కారణం అదే.. ఇకనైనా: పంత్‌ అసంతృప్తి!

22 May, 2022 11:02 IST|Sakshi
ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(PC: IPL/BCCI)

ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసే కీలక మ్యాచ్‌లో గెలుపునకై తమ జట్టు పోరాటం సరిపోలేదని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒత్తిడిని అధిగమించి ప్రణాళికలను పక్కాగా అమలు చేసే ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయితే, తమ బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. టోర్నీ ఆసాంతం మెరుగ్గా ఆడారని కొనియాడాడు.

కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయి ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించలేకపోయింది.  టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగన ఉన్న ముంబై చేతిలో కంగుతిని చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. 

ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ మాట్లాడుతూ.. ‘‘పైచేయి సాధిస్తామనుకున్న సందర్భాల్లో ఆఖరి వరకు పోరాడి ఓడిపోవడం నిరాశకు గురిచేసింది. టోర్నీ మొత్తం ఇదే తరహా అనుభవాలు ఎదురయ్యాయి.  ‘‘ఈ మ్యాచ్‌లో మేము ఆడిన తీరు గెలిచేందుకు సరిపోదు. ఒత్తిడి అనేది ఇక్కడ సమస్యే కాదు. మేము మరింత మెరుగ్గా మా ప్రణాళికలు అమలు చేయాల్సింది. కానీ అలా జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.

అదే విధంగా.. ‘‘5-7 పరుగులు చేసి ఉంటే బాగుండేది. టోర్నమెంట్‌ మొత్తంలో మా బౌలర్లు మెరుగ్గా రాణించారు. ఓటమి చాలా బాధిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న పంత్‌.. వచ్చే సీజన్‌లో సరికొత్త ఉత్సాహంతో ముందుకు వస్తామని పేర్కొన్నాడు. ఇక ముంబై చేతిలో ఢిల్లీ పరాజయం పాలు కావడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

ఐపీఎల్‌ మ్యాచ్‌: 69- ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌
టాస్‌: ముంబై- తొలుత బౌలింగ్‌
ఢిల్లీ స్కోరు: 159/7 (20)
ముంబై స్కోరు: 160/5 (19.1)
విజేత: ముంబై.. ఐదు వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా(4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు)
Rishabh Pant-IPL 2022: విలన్‌గా మారిన పంత్‌.. ఆ రివ్యూ తీసుకొని ఉంటే

Poll
Loading...
మరిన్ని వార్తలు