Rovman Powell Biography: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి.. ఇప్పుడిలా!

29 Apr, 2022 12:18 IST|Sakshi
రోవ్‌మన్‌ పావెల్‌(PC: IPL/BCCI)

IPL 2022 DC Vs KKR- Rovman Powell: వెస్టిండీస్‌ బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్‌ ఐపీఎల్‌-2022 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడాడు. ఇందులో రెండు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా 20, 3, 8, 0, 36 పరుగులు చేశాడు.

ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 33 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో పావెల్‌ను కొనియాడాడు వెస్టిండీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఇయాన్‌ బిషప్‌. పేదరికాన్ని జయించి తన తల్లి, చెల్లి బాగోగులు చూసుకుంటున్న తీరును ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

ఈ మేరకు బిషప్‌ మాట్లాడుతూ.. ‘‘మీలో ఎవరికైనా ఓ పది నిమిషాల సమయం ఉంటే.. వెళ్లి రోవ్‌మన్‌ యూట్యూబ్‌లో ఉన్న రోవ్‌మన్‌ పావెల్‌ లైఫ్‌స్టోరీ చూడండి. నేను.. నాతోపాటు మరికొంత మంది పావెల్‌ ఐపీఎల్‌ ఆడాలని ఎందుకు కోరుకున్నారో.. అతడు అద్భుతంగా ఆడాలని ఆకాంక్షించారో మీకే తెలుస్తుంది. 

చిన్న స్థాయి నుంచి అతడు అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడి దాకా వచ్చాడు. తాను సెకండరీ స్కూళ్లో ఉన్నపుడే పేదరికం నుంచి మిమ్మల్ని బయటపడేస్తానంటూ తన తల్లికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు’’ అని పావెల్‌ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తాడు. 

పేదరికాన్ని జయించి
జమైకాలోని ఓల్డ్‌ హార్బర్‌లో గల బానిస్టర్‌ జిల్లాలో 1993, జూలై 23న పావెల్‌ జన్మించాడు. అతడి తల్లి సింగిల్‌ పేరెంట్‌. పావెల్‌తో పాటు ఆమె ఓ కూతురు కూడా ఉంది. ఇద్దరు పిల్లల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న ఆమె.. ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని పెంచి పెద్ద చేసింది. 

చిన్న ఇంట్లో తల్లి ఇబ్బందులు చూస్తూ పెరిగిన పావెల్‌.. ఆమె ప్రశాంత జీవితం గడిపేలా అన్ని సౌకర్యాలు ఉన్న జీవితం అందించాలనే తలంపుతో చిన్ననాటి నుంచే క్రికెటర్‌ కావాలన్న తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానిని నిజం చేసుకుని తల్లి, చెల్లిని బాగా చూసుకుంటున్నాడు. పావెల్‌ జీవిత విశేషాలకు సంబంధించిన విషయాలను కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 సీజన్‌ సమయంలో డాక్యుమెంటరీ రూపొందించారు.

ఇక పావెల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 2016లో శ్రీలంకతో జరిగిన వన్డేతో వెస్టిండీస్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది పాకిస్తాన్‌తో సిరీస్‌తో టీ20 ఫార్మాట్‌లోనూ అడుగుపెట్టాడు. 

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగమైన పావెల్.. ఐపీఎల్‌ మెగా వేలం-2022లో తన పేరు నమోదు చేసుకోగా ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని కొనుగోలు చేసింది. రూ. 2.8 కోట్లు ఖర్చు చేసి పావెల్‌ను సొంతం చేసుకుంది.

చదవండి👉🏾 Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్‌ క్యాప్‌ అతడిదే: కుల్దీప్‌

>
మరిన్ని వార్తలు