-

కత్తి కార్తీక్‌

17 Apr, 2022 05:35 IST|Sakshi

దినేశ్‌ కార్తీక్‌ మెరుపు బ్యాటింగ్‌

16 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై బెంగళూరు విజయం

ముంబై: గత ఐదు మ్యాచ్‌లలో సహాయక పాత్రలో బెంగళూరుకు విజయాలు అందించిన దినేశ్‌ కార్తీక్‌ ఈసారి మరింత ఎక్కువ బాధ్యతతో తానే ముందుండి జట్టును గెలిపించాడు. శనివారం జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 16 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.  

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్‌ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, షహబాజ్‌ (21 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం ఢిల్లీ  20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్‌ (38 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశారు. బెంగళూరు బౌలర్లు హేజల్‌వుడ్‌ (3/28), సిరాజ్‌ (2/31) రాణించారు.

బెంగళూరు ఓపెనర్లు డుప్లెసిస్‌ (8), రావత్‌ (0) తక్కువ వ్యవధిలో పెవిలియన్‌ చేరగా, అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి కోహ్లి (12) రనౌట య్యాడు. ఈ దశలో మ్యాక్స్‌వెల్‌ దూకుడైన బ్యాటింగ్‌ జట్టును నిలబెట్టింది. తనదైన శైలిలో భారీ షాట్లు ఆడిన మ్యాక్స్‌వెల్‌... కుల్దీప్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి 23 పరుగులు రాబట్టాడు. మ్యాక్సీ వెనుదిరిగిన తర్వాత మెరుపు బ్యాటింగ్‌ బాధ్యతను దినేశ్‌ కార్తీక్‌ తీసుకున్నాడు. 5 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ వదిలేయడం కూడా ఆర్‌సీబీకి కలిసొచ్చింది. ఆ తర్వాత కార్తీక్‌ చెలరేగిపోయాడు. ముఖ్యంగా ముస్తఫిజుర్‌ వేసిన 18వ ఓవర్లో అతని బ్యాటింగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో కార్తీక్‌ వరుసగా 4, 4, 4, 6, 6, 4 (మొత్తం 28 పరుగులు) బాదడం విశేషం. 26 బంతుల్లోనే కార్తీక్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు.  

    వార్నర్‌ బ్యాటింగ్‌ మినహా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనిపించలేదు. పృథ్వీ షా (16), మిచెల్‌ మార్‌‡్ష (14), పావెల్‌ (0), లలిత్‌ యాదవ్‌ (1) విఫలమయ్యారు. వార్నర్‌ క్రీజ్‌లో ఉన్నంత వరకు ఢిల్లీ గెలుపుపై నమ్మకంతో ఉన్నా... హసరంగ బౌలింగ్‌లో అతను ఎల్బీగా వెనుదిరగడంతో ఆశలు సన్నగిల్లాయి.

మరిన్ని వార్తలు