IPL 2022: చెత్త నిర్ణయాలు వద్దు.. మా అంపైర్లను పంపిస్తాం; బీసీసీఐకి చురకలు

10 Apr, 2022 17:26 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి ఔటైన విధానం వివాదాస్పదంగా మారింది. విషయంలోకి వెళితే.. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌లో డెవాల్డ్ బ్రెవిస్ వేసిన తొలి బంతిని ఢిపెన్స్‌ ఆడటానికి విరాట్‌ కోహ్లి ప్రయ్నతించాడు. ఈ క్రమంలో బంతి మిస్స్‌ అయ్యి కోహ్లి ప్యాడ్‌ను తాకింది. బ్రెవిస్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీ అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. తాను ఔట్‌ కాదంటూ కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్‌, ప్యాడ్‌ రెండింటినీ ఒకే సమయంలో తాకుతున్నట్లు కనిపించింది.

కోహ్లితో పాటు అభిమానులు ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోక తప్పదని భావించారు. అయితే  బంతి బ్యాట్‌కు ముందు తాకినట్లు సృష్టమైన ఆధారాలు కనిపించడం లేదంటూ థర్డ్ అంపైర్  కోహ్లి ఔట్‌ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంతో​ కోహ్లి షాక్‌కు గురయ్యాడు. తాను ఔట్‌ కాదంటూ గట్టిగా అరుస్తూ కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ పెవిలియన్‌ చేరాడు.

కాగా కోహ్లి ఔట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ వ్యవహరించిన తీరుపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీసీసీఐ కలగజేసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయాల వల్ల ఆటగాళ్లు బలవుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయమై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ అసొసియేషన్‌ ట్విటర్‌ వేదికగా బీసీసీఐకి చురకలు అంటించింది. 

''మీ అంపైర్లకు సరైన నిర్ణయాలు తీసుకోవడం రావడం లేదు..మా దగ్గర మంచి ట్రెయిన్‌ అయిన అంపైర్లు ఉన్నారు..  కావాలంటే చెప్పండి పంపిస్తాం అంటూ పేర్కొంది. ఎల్బీ అప్పీల్‌లో బంతి మొదట బ్యాట్‌ను లేక ప్యాడ్‌ను తాకిందా అని చెప్పడం ఫీల్డ్‌ అంపైర్లకు కష్టసాధ్యం. కానీ టీవీ అంపైర్లు ఇది సులువుగా తెలుసుకోవచ్చు. అల్ట్రాఎడ్జ్‌లో స్లో మోషన్‌ రిప్లే టెక్నాలజీ ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కోహ్లి ఔట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ అలా చేయలేకపోయారు. బీసీసీఐ.. మా దగ్గర ఇలాంటి వాటిలో ఆరితేరిన అంపైర్లు ఉన్నారు.. మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు.. కావాలంటే చెప్పండి'' అంటూ పేర్కొంది.

చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం చేశాడంటే..!

మరిన్ని వార్తలు