IPL 2022: చెన్నై.. 19వ ఓవర్‌ శివమ్‌ దూబేతో వేయించడం సరైన నిర్ణయమే: టీమిండియా మాజీ క్రికెటర్‌

1 Apr, 2022 14:36 IST|Sakshi
PC: IPL/BCCI

Irfan Pathan On 19th over for CSK was the right call: ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌ ఏరికోరి మరీ టీమిండియా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేను కొనుగోలు చేసింది.   రూ. 4 కోట్లు వెచ్చించచి అతడిని సొంతం​ చేసుకుంది. తాజా సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ ముంబైకర్‌.

కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 6 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. అదే విధంగా ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేసి 11 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక గురువారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 49 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

అయితే, 19వ ఓవర్లో కెప్టెన్‌ రవీంద్ర జడేజా బంతిని శివమ్‌కు ఇవ్వగా లక్నో బ్యాటర్లు ఆయుష్‌ బదోని, ఎవిన్‌ లూయిస్‌ భారీగా పరుగులు పిండుకున్నారు. బదోని ఒక సిక్సర్‌ బాదగా, లూయిస్‌ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టాడు. రెండు వైడ్‌లు కూడా పడ్డాయి. దీంతో కీలక సమయంలో శివమ్‌ వేసిన ఓవర్లో 25 పరుగుల రూపంలో సీఎస్‌కే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.

ఫలితంగా ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఫ్యాన్స్‌ శివమ్‌పై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 19వ ఓవర్లో బంతిని శివమ్‌కు ఇవ్వడాన్ని సమర్థించాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పఠాన్‌ మాట్లాడుతూ.. ‘‘వాళ్లకు(చెన్నై) ఎక్కువ ఆప్షన్లు లేవు. జడేజా లేదంటే మొయిన్‌ అలీ ఉన్నారు. కానీ పిచ్‌ పరిస్థితిని బట్టి ఫాస్ట్‌బౌలర్‌ను పంపాలి.

అందుకే శివమ్‌ దూబే చేతికి బంతిని ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పనికివస్తాడనే కదా వేలంలో శివమ్‌ దూబే వెంట పడింది’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, కీలక ఓవర్లో శివమ్‌ దూబే మెరుగ్గా బౌలింగ్‌ చేయాల్సిందని, కానీ పరిస్థితుల్లో ఒత్తిడి సహజమని పేర్కొన్నాడు. ఏదేమైనా శివమ్‌కు 19వ ఓవర్‌ ఇచ్చిన సీఎస్‌కే నిర్ణయం సరైందేనని అభిప్రాయపడ్డాడు.     

చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు!

మరిన్ని వార్తలు