కొన్నది ఎకరం.. కొట్టేసింది 4.35 ఎకరాలు.. వాహనం ఆపి సోదా చేయగా..

1 Apr, 2022 14:30 IST|Sakshi
క్రాంతికుమార్‌ , పోలీసులు స్వాధీనం చేసుకున్న తల్వార్‌

ఘరానా మోసగాడి అరెస్టు

రూ.3.08 లక్షలు, తల్వార్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు 

సాక్షి, మోమిన్‌పేట(వికారాబాద్‌): ఓ మహిళా రైతును మోసం చేసి.. ఆమెకు తెలియకుండా 4.35 ఎకరాల భూమిని కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన సంఘటన మోమిన్‌పేటలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.. దేవరంపల్లికి చెందిన మ్యాదరి అంజమ్మకు గ్రామంలోని సర్వే నంబర్లు 97, 99లో ఐదెకరాల 35గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఒక ఎకరా భూమిని చీమల్‌దరి గ్రామానికి చెందిన గొర్లకాడి క్రాంతికుమార్, అతని స్నేహితులకు విక్రయించింది.

ఎకరం కొనుగోలు చేసిన కాంత్రికుమార్‌.. అంజమ్మ పేరున ఉన్న 5.35 ఎకరాల మొత్తం భూమిని డిసెంబరు 10, 2020 రోజున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. ఎకరా అమ్మగా వచ్చిన డబ్బును తన కూతుళ్లకు సమానంగా ఇవ్వాలని అంజమ్మ నిర్ణయించుకుంది. మిగిలిన నాలుగెకరాల భూమిని కుమారులకు పంచాలని భావించింది. అయితే తన పాసు పుస్తకంలోని మొత్తం భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారనే మోసాన్ని ఆలస్యంగా గుర్తించి.. సదరు వ్యక్తులను నిలదీసింది.
చదవండి: కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు 

ఈ విషయమై కొంతమంది సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో అంజమ్మ భూమిని తిరిగి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు కాంత్రికుమార్, అతని స్నేహితులు ఒప్పుకొన్నారు. కాలం గడుస్తున్నాకొద్ది విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. ఇక లాభం లేద నుకున్న అంజమ్మ తనకు జరిగిన అన్యాయంపై ఇటీవల పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా క్రాంతికుమార్‌ గురువారం మధ్యాహ్నం మేకవనంపల్లి వైపు వెళ్లున్నట్లు సమాచారం తెలుసుకొన్న సీఐ వెంకటేశం, ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తమ సిబ్బందితో వెళ్లి కారును చేజ్‌ చేసి పట్టుకున్నారు.

వాహనాన్ని ఆపి సోదా చేయగా రూ.3.08లక్షలు నగదుతో పాటు ఒక తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. తల్వార్‌ ఎందుకు ఉపయోగిస్తున్నావని ప్రశ్నించగా.. తాను భూముల క్రయవిక్రయాలు చేస్తుంటానని, ప్రాణ రక్షణ కోసం కారులో తల్వార్‌ పెట్టుకున్నానని సీఐకి చెప్పాడు. దీంతో అతనిపై అక్రమంగా మారణాయుధాలు కలిగిన నేరంతో పాటు మోసం చేసిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.   

నేరచరిత్రే.. 
క్రాంతికుమార్‌పై గతంలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. 2007, 2013, 2020లో మూడు, 2022లో రెండు కేసులు బుక్‌ అయ్యాయి. ఇందులో అక్రమంగా భూమి క్రయవిక్రయాలు, మర్డర్‌ కేసు, ప్రస్తుత చీమల్‌దరి సర్పంచుపై బెదిరింపులకు పాల్పడటం వంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.     

మరిన్ని వార్తలు