IPL 2022: అతడు భవిష్యత్‌ ఆశా కిరణం: డుప్లెసిస్‌ ప్రశంసలు

10 Apr, 2022 11:20 IST|Sakshi
అనూజ్‌ రావత్‌(PC: IPL/BCCI)

అర్ధ శతకంతో రాణించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్‌ అనూజ్‌ రావత్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి ఆట తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, కోచ్‌ సంజయ్‌ సైతం అనూజ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ను కొనియాడుతున్నారు.

కాగా ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బెంగళూరు.. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్‌ సేన 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేధనకు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ 24 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన మాజీ సారథి విరాట్‌ కోహ్లితో కలిసి మరో ఓపెనర్‌ అనూజ్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

47 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. కోహ్లి(48), అనూజ్‌ రాణించడంతో 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. ‘‘ముంబై వంటి పటిష్టమైన జట్టుపై గెలుపొందడం సంతోషంగా ఉంది. మా బౌలర్లు అత్యుత్తమంగా రాణించారు. 18వ ఓవర్ల పాటు మా బ్యాటింగ్‌ అద్భుతంగా సాగింది.

అనూజ్‌ రావత్‌కు మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉంది. భవిష్యత్‌ ఆశాకిరణం అతడు. మ్యాచ్‌కు ముందు అనూజ్‌తో ఎన్నో విషయాలు చర్చించాను. ఇక ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు’’ అని అనూజ్‌, ఆకాశ్‌లను కొనియాడాడు. ఇక కోచ్‌ సంజయ్‌ అనూజ్‌గురించి చెబుతూ.. ‘‘ఆరంభ మ్యాచ్‌లలో తడబడ్డా ప్రస్తుతం బాగా రాణిస్తున్నాడు.

ముంబైతో మ్యాచ్‌లో అద్భుతమైన షాట్లు ఆడాడు. ఫాఫ్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నాడు. తనది చాలా కష్టపడే తత్వం. అనూజ్‌ ఇన్నింగ్స్‌ పట్ల మేము సంతోషంగా ఉన్నాం’’ అని పేర్కొన్నాడు.
ఆర్సీబీ వర్సెస్‌ ముంబై స్కోర్లు
ముంబై-151/6 (20)
ఆర్సీబీ-152/3 (18.3)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అనూజ్‌ రావత్‌

చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌ అయినా గెలవండిరా బాబూ! సిగ్గుతో చచ్చిపోతున్నాం!

మరిన్ని వార్తలు