హిట్‌మ్యాన్‌కు చేదు అనుభవాల్ని మిగిల్చిన ఐపీఎల్‌ 2022..చెత్త రికార్డులు నమోదు  

22 May, 2022 13:57 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ఐపీఎల్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోహిత్‌ ఈ సీజన్‌లో చెత్త రికార్డులన్నీ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్‌లో రోహిత్‌ సారధ్యంలో ముంబై ఇండియన్స్‌ వరుసగా 8 మ్యాచ్‌ల్లో పరాజయంపాలై మునుపెన్నడూ లేని అప్రతిష్టను మూటగట్టుకోగా.. హిట్‌మ్యాన్‌ వ్యక్తిగతంగానూ చాలా అపవాదులను ఎదుర్కొన్నాడు.

సీజన్‌ ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీని ఖంగుతినిపించి ఆర్సీబీని ఘనంగా ప్లే ఆఫ్స్‌కు సాగనంపిన రోహిత్‌ సేన.. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 10 పరాజయాలతో సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించింది. ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇలా టేబుల్‌ ఆఖరి స్థానంలో నిలువడం ఇదే మొదటిసారి. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా ఘోరంగా విఫలమైన రోహిత్‌.. వ్యక్తిగతంగానూ దారుణంగా నిరాశపరిచాడు. సీజన్‌ మొత్తంలో పేలవ ఫామ్‌ను కొనసాగించి పలు చెత్త రికార్డులను నమోదు చేశాడు. 

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ (13 బంతుల్లో 2) పేలవ ప్రదర్శనను కొనసాగించిన హిట్‌మ్యాన్‌.. ఈ సీజన్‌లో ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయకుండా కేవలం 268 పరుగులు మాత్రమే చేశాడు. 2008లో ఐపీఎల్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి రోహిత్‌ ఇంత చెత్త గణాంకాలు ఎప్పుడూ నమోదు చేయలేదు. తొలిసారి ఓ సీజన్‌ను కనీసం హాఫ్‌ సెంచరీ చేయకుండా ముగించాడు. లీగ్‌ చరిత్రలో 2018 సీజన్‌లో ఏకైకసారి 300ల్లోపు పరుగులు (286) చేసిన హిట్‌మ్యాన్‌ తాజాగా సీజన్‌లో ఆ చెత్త రికార్డును కూడా అధిగమించాడు.   
చదవండి: ఐపీఎల్‌లో తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన ఫీట్‌
 

మరిన్ని వార్తలు