Ben Stokes: నాన్‌ స్ట్రయికర్‌ ముందుగా క్రీజ్‌ వదిలితే 6 పరుగులు పెనాల్టి..!

11 Apr, 2023 16:46 IST|Sakshi
photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఏప్రిల్‌ 11) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌ తర్వాత సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఓ ఆసక్తికర ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌.. బౌలర్‌ బంతి వేయకముందే క్రీజ్‌ దాటితే 6 పరుగులు పెనాల్టి విధించాలని ఆయన కోరాడు.

ఎల్‌ఎస్‌జే-ఆర్సీబీ మ్యాచ్‌లో హర్షల్‌-బిష్ణోయ్‌ మన్కడింగ్‌ ఉదంతం తర్వాత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ స్టోక్స్‌ ఈరకంగా స్పందించాడు. బిష్ణోయ్‌.. బౌలర్‌ బంతి వేయకముందే క్రీజ్‌ వదిలి వెళ్లాడు. ఇంకా ఎవరైనా ఇలాంటి సందర్భంలో కూడా మన్కడింగ్‌ (నాన్‌ స్ట్రయికర్‌ రనౌట్‌) చేయొద్దని అంటారా అంటూ హర్షా ట్వీట్‌ చేయగా.. ఈ ట్వీట్‌కు బదులిస్తూ స్టోక్స్‌ పైవిధంగా స్పందించాడు. 

కాగా, నిన్నటి మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సి తరుణంలో నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న రవి బిష్ణోయ్‌.. బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ బంతి వేయకముందే క్రీజ్‌ దాటి చాలా ముందుకు వెళ్లాడు. ఇది గమనించిన హర్షల్‌ మన్కడింగ్‌ చేసి భిష్ణోయ్‌ను రనౌట్‌ చేశాడు. అయితే దీన్ని అంపైర్‌ పరిగణించలేదు. హర్షల్‌కు బౌల్‌ వేసే ఉద్ధేశం లేకపోవడంతో పాటు క్రీజ్‌ దాటినందుకు గానూ మన్కడింగ్‌ను అంపైర్‌ ఒప్పుకోలేదు.

నిబంధనల ప్రకారం బౌలర్‌ బౌలింగ్‌ చేసే ఉద్దేశం లేకపోయినా, క్రీజ్‌ దాటి బయటకు వెళ్లినా మన్కడింగ్‌ చేయడానికి వీలు లేదు. మన్కడింగ్‌ రూల్‌ ప్రకారం బౌలర్‌ బంతి సంధించే ఉద్దేశం కలిగి, క్రీజ్‌ దాటకుండా ఉంటేనే రనౌట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. మొత్తానికి హర్షల్‌ చివరి బంతికి మన్కడింగ్‌ చేయలేకపోవడంతో బిష్ణోయ్‌ బ్రతికిపోయాడు. ఆతర్వాత ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో వికెట్‌ తేడాతో విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు