-

IPL 2023 Eliminator MI VS LSG: సపోర్ట్‌ బౌలర్‌గా వచ్చాడు.. అతనిలో టాలెంట్‌ ఉందని ముందే పసిగట్టాను..!

25 May, 2023 08:06 IST|Sakshi
PC: IPL Twitter

ఆకాశ్‌ మధ్వాల్‌పై రోహిత్‌ శర్మ ప్రశంసలు

ఐపీఎల్‌ 2023లో భాగంగా నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నోపై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ (3.3-0-5-5) అద్భుతమైన బౌలింగ్‌ విన్యాసాలతో ముంబైని గెలిపించాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఐదో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, లక్నో బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేసిన ఆకాశ్‌పై మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. యువ పేసర్‌ను ఆకాశానికెత్తాడు.

గత సీజన్‌లో ఆకాశ్‌ సపోర్ట్‌ బౌలర్‌గా జట్టులో చేరాడని, అతనిలో టాలెంట్‌ను ముందే పసిగట్టానని, జోఫ్రా ఆర్చర్‌ మధ్యలో వెళ్లిపోయాక ఆకాశ్‌ అతని లోటును భర్తీ చేయగలడనే నమ్మకం ముందే కలిగిందని, ఆకాశ్‌.. ముంబైని గెలిపించగలడని ముందే నమ్మానని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. 

అనూహ్య పరిణామాల మధ్య ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి, ఆపై ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో నెగ్గడంపై రోహిత్‌ స్పందిస్తూ.. చాలా సీజన్లుగా చేస్తున్నదే తాము ఈ సీజన్‌లోనూ చేశాం. అయితే ఈ సారి కాస్త వైవిధ్యంగా చేశామని అన్నాడు. 

జట్టులో యువ ఆటగాళ్ల (భారత ఆటగాళ్లు) గురించి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్‌ కుర్రాళ్లు చాలామంది భారత్‌కు ఆడటం చూశాం. వారు తమకు ప్రత్యేకమనే అనుభూతిని కలిగించడం ద్వారా ఫలితాలు రాబట్టగలిగాం. ఈ ప్రదర్శనలే వారిని టీమిండియాకు ఆడేలా చేస్తున్నాయని తెలిపాడు. 

మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ.. జట్టుగా మేము ఫీల్డింగ్‌ను బాగా ఆస్వాదించామని,  ఫీల్డ్‌లో ప్రతి ఒక్కరూ చురుగ్గా ఉండటం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపాడు. 

చెన్నైలో ఆడటంపై స్పందిస్తూ.. ఇది మాకు రెండో హోం టౌన్‌ లాంటిదని, ఇక్కడ ఆడినప్పుడుల్లా వాంఖడేలో ఆడిన ఫీలింగే కలుగుతుందని చెప్పుకొచ్చాడు. అంతిమంగా.. సమష్టిగా రాణించడం వల్లే తాము లక్నోపై విజయం సాధించగలిగామని తెలిపాడు. 

కాగా, లక్నోపై డూ ఆర్‌ డై మ్యాచ్‌లో గెలవడం ద్వారా ముంబై క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. క్వాలిఫయర్‌-2లో రోహిత్‌ సేన.. గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఇందులో గెలిచిన జట్టు మే 28న జరిగే ఫైనల్లో సీఎస్‌కేతో తలపడుతుంది.

చదవండి: #LSG: ఎలిమినేటర్‌ గండం దాటలేక.. ఓటమికి కారణాలెన్నో!

మరిన్ని వార్తలు