IPL 2023: వీళ్లకిదే తొలిసారి! తలపండినోళ్లకు తక్కువే! వారికి మాత్రం కళ్లు చెదిరే మొత్తం.. కోట్లలో..

30 Mar, 2023 13:24 IST|Sakshi

IPL 2023- Debutants: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో రారాజుగా వెలుగొందుతోంది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్‌ కలలు కంటారనడంలో సందేహం లేదు. ఒక్కసారి ఐపీఎల్‌లో ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. దశ తిరిగిపోతుందని ఇప్పటికే ఎంతో మంది ప్లేయర్లు నిరూపించారు కూడా!

ఇక మార్చి 31 నుంచి ఐపీఎల్‌-2023 సీజన్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదహారవ సీజన్‌తో ఈ మెగా ఈవెంట్‌లో అడుగుపెడుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం!

కామెరాన్‌ గ్రీన్‌
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌. ఐపీఎల్‌ మినీ వేలం-2023లో ముంబై ఇండియన్స్‌ అతడి కోసం ఏకంగా 17 కోట్ల రూపాయలు వెచ్చించింది. భారీ మొత్తానికి అతడిని కొనుగోలు చేసింది. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు ఆసీస్‌ తరఫున ఆడిన 8 టీ20 మ్యాచ్‌లలో 173.75 స్ట్రైక్‌రేటుతో 139 పరుగులు చేశాడు.

అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడీ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌. కాగా గ్రీన్‌కు ఇదే తొలి ఐపీఎల్‌. గతేడాది దారుణ వైఫల్యంతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈ ఆల్‌రౌండర్‌పై గంపెడాశలు పెట్టుకుంది.

హ్యారీ బ్రూక్‌
ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుంది. ఈ పవర్‌ హిట్టర్‌ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 20 టీ20లు ఆడి 372 పరుగులు చేశాడు. 

ఇక పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో విశ్వరూపం ప్రదర్శించిన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్‌ మూడు మ్యాచ్‌లలో 468 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.  13 కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి తనని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్‌కు మరి ఏ మేరకు ‘తిరిగి చెల్లిస్తాడో’ ఈ యువ బ్యాటర్‌. 

సికందర్‌ రజా
పాకిస్తాన్‌ మూలాలున్న జింబాబ్వే స్టార్‌ క్రికెటర్‌ సికందర్‌ రజా. టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో అతడి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 147.97 స్ట్రైక్‌రేటుతో 219 పరుగులు సాధించాడీ ఆల్‌రౌండర్‌. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను తిప్పలు పెడుతూ 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు.

ఇక జింబాబ్వే తరఫున ఇప్పటి వరకు 66 టీ20లు ఆడి.. 1259 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో గతేడాది మినీ వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ రజాను 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 36 ఏళ్ల ఈ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ తన తొలి ఐపీఎల్‌ ఎడిషన్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి!

ముకేశ్‌ కుమార్‌
దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌. 29 ఏళ్ల ముకేశ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో ఇప్పటి వరకు ఆడిన 35 మ్యాచ్‌లలో 134 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో 7.20 ఎకానమీతో బౌలింగ్‌ చేశాడు.
 
రంజీ ట్రోఫీ-2021-22 సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో 20 వికెట్లు తీసిన ఈ ఫాస్ట్‌బౌలర్‌.. విజయ్‌ హజారే ట్రోఫీ-2022లో ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటిన ముకేశ్‌ కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏకంగా 5.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. తొలి సీజన్‌లోనే భారీ మొత్తం పలికిన ముకేశ్‌ కుమార్‌ ఢిల్లీ యాజమాన్యం నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటాడో మరి!

జాషువా లిటిల్‌
ఐరిష్‌ పేసర్‌ జాషువా లిటిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నాడు. తన పదునైన పేస్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించే లిటిల్‌ తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నాడు.

ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ ఐర్లాండ్‌ తరఫున ఆడిన 26 టీ20లలో 39 వికెట్లు తీశాడు. గతేడాది పొట్టి ప్రపంచకప్‌ టోర్నీలో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో మెరిశాడు.

ఈ ఐసీసీ ఈవెంట్‌లో మొత్తంగా ఏడు మ్యాచ్‌లలో 7 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్న 23 ఏళ్ల లిటిల్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ 4.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

వీరు సైతం
ఇక ఈ ఐదుగురితో పాటు ఇంగ్లండ్‌ మాజీ సారథి, అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం కలిగిన 32 ఏళ్ల జో రూట్‌(రాజస్తాన్‌ రాయల్స్‌- ధర. కోటి), న్యూజిలాండ్‌ బ్యాటర్‌, 32 ఏళ్ల మైకేల్‌ బ్రేస్‌వెల్‌(ఆర్సీబీ- ధర కోటి) కూడా ఐపీఎల్‌ పదహారో ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

చదవండి: Cristiano Ronaldo: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా?
రూ. 13 కోట్లకు పైగా! ఈసారి ఆరెంజ్‌ క్యాప్‌ సన్‌రైజర్స్‌ బ్యాటర్‌కే! కచ్చితంగా అతడే..

>
మరిన్ని వార్తలు