IPL 2023 CSK Vs GT Probable Playing XI: ‘ఫైనల్‌’కు ముందెవరు?

23 May, 2023 05:29 IST|Sakshi

జోరు మీదున్న టైటాన్స్‌

ఆల్‌రౌండ్‌ సత్తాతో సూపర్‌కింగ్స్‌

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం

చెన్నై: ఐపీఎల్‌లో రెండు దీటైన జట్ల మధ్య ఢీ అంటే ఢీ అనే మ్యాచ్‌కు నేడు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో నాలుగు సార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనుంది. చెన్నై వేదికగా మ్యాచ్‌ జరగడం ధోని సేనకు అనుకూలత అయినప్పటికీ... ఈ జట్టుపై ఓటమి ఎరుగని గుజరాత్‌ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది.

ఈ నేపథ్యంలో రెండు సమఉజ్జీల మధ్య ఆసక్తికర సమరం గ్యారంటీ! దీంతో ప్రేక్షకులకు టి20 మెరుపులు, ఆఖరి ఓవర్‌ డ్రామాకు కొదవుండదు. ఇక చెన్నైలో గెలిచినా... ఓడినా... చివరి మజిలీ మాత్రం అహ్మదాబాదే! నెగ్గితే నేరుగా ఒక జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు మరో ప్రయత్నంగా రెండో క్వాలిఫయర్‌లో ఆడుతుంది. ఈ    రెండూ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగనున్నాయి.  

చెన్నై చెలరేగితే...
బరిలోకి దిగే రెండు జట్లు బలమైన ప్రత్యర్థులు. చెన్నై ఐపీఎల్‌ ఆరంభం నుంచే లీగ్‌ ఫేవరేట్లలో ఒకటిగా ఎదిగింది. ధోని నాయకత్వంలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఎన్నోసార్లు నిరూపించుకుంది. ఈ సీజన్‌లోనూ సూపర్‌కింగ్స్‌ ఆట మేటిగానే ఉంది. టాపార్డర్‌ లో రుతురాజ్‌ గైక్వాడ్, డెవాన్‌ కాన్వే, అజింక్య రహానే, శివమ్‌ దూబే ధనాధన్‌ షోకు శ్రీకారం చుడితే ప్రత్యర్థికి చుక్కలే! వెటరన్‌ ధోని బ్యాటింగ్‌లో వెనుకబడొచ్చేమో కానీ... జట్టును నడిపించడంలో ఎప్పటికీ క్రికెట్‌ మేధావే.

మిడిలార్డర్‌లో అంబటి రాయుడు నుంచి ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బహుశా ఈ మ్యాచ్‌లో ఆ వెలతి తీర్చుకుంటాడేమో చూడాలి. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ... ఇక బౌలింగ్‌ దళంలో దీపక్‌ చహర్, తుషార్‌ దేశ్‌పాండే పవర్‌ ప్లేలో పరుగులిస్తున్నప్పటికీ  వికెట్లను మాత్రం పడగొట్టేస్తున్నారు. తీక్షణ, పతిరణల వైవిధ్యం కూడా జట్టుకు కీలక సమయాల్లో ఉపయోగపడుతుంది.  

టైటాన్స్‌ ‘టాప్‌’షో
టోర్నీ మొదలైన మ్యాచ్‌లోనే చెన్నైపై గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ లీగ్‌లో ఘనమైన ఆరంభమిచ్చింది. బెంగళూరుతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ టైటాన్స్‌దే ఆధిపత్యం. సొంతగడ్డపై బెంగళూరు భారీస్కోరు చేసినా ఛేదించి మరీ నెగ్గింది. పాయింట్ల పట్టికైనా... ఆటలోనైనా... డిఫెండింగ్‌ చాంపియన్‌కు లీగ్‌ దశలో అయితే ఎదురే లేకపోయింది. ముఖ్యంగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను పాండ్యా సేన సమర్థంగా సరైన దిశలో వినియోగించుకుంటుంది.

శుబ్‌మన్‌ గిల్‌ లేదంటే విజయ్‌ శంకర్‌ల ‘ఇంపాక్ట్‌’ జట్టుకు అదనపు పరుగుల్ని కట్టబెడుతోంది. జట్టులో వీళ్లిద్దరే కాదు... సాహా నుంచి రషీద్‌ ఖాన్‌ దాకా ఇలా ఎనిమిదో వరుస బ్యాటర్‌ కూడా బాదేయగలడు. షనక, మిల్లర్, రాహుల్‌ తెవాటియాలు ధాటిగా ఆడగల సమర్థులు. దీంతో పరుగులకు, మెరుపులకు ఏ లోటు లేదు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే మోహిత్‌ శర్మ, నూర్‌ అహ్మద్, షమీ, రషీద్‌ ఖాన్‌ కలిసొచ్చే పిచ్‌పై మ్యాచ్‌నే మలుపుతిప్పే బౌలర్లు. ఏ రకంగా చూసుకున్నా ఎవరికీ ఎవరు తీసిపోరు కాబట్టి హేమాహేమీల మధ్య వార్‌ వన్‌సైడ్‌ అయితే కానే కాదు!

తుది జట్లు (అంచనా)
గుజరాత్‌ టైటాన్స్‌: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సాహా, గిల్, విజయ్‌  శంకర్, షనక, మిల్లర్, తెవాటియా, రషీద్‌ ఖాన్, నూర్‌ అహ్మద్, షమీ, మోహిత్‌ శర్మ/యశ్‌ దయాళ్‌.
చెన్నై సూపర్‌ కింగ్స్‌: ధోని (కెప్టెన్‌), రుతురాజ్, కాన్వే, దూబే/పతిరణ,      జడేజా, రహానే, మొయిన్‌ , రాయుడు, దీపక్‌ చహర్, తుషార్, తీక్షణ.

పిచ్, వాతావరణం
ఎప్పట్లాగే చెన్నై పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశముంది. అయితే రాత్రయ్యేకొద్దీ తేమ కారణంగా
బౌలర్లకు కష్టాలు తప్పవు. టాస్‌ నెగ్గిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపువచ్చు. వర్ష సూచన లేదు.

3: ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు గుజరాత్‌ టైటాన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా... మూడింటిలోనూ గుజరాత్‌ జట్టే గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై నిర్దేశించిన లక్ష్యాలను గుజరాత్‌ ఛేదించింది. అయితే చెన్నై వేదికగా మాత్రం ఈ రెండు జట్లు తొలిసారి తలపడుతున్నాయి.

43: ఐపీఎల్‌ టోర్నీలో చెన్నై వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మొత్తం 61 మ్యాచ్‌లు ఆడింది. 43 మ్యాచ్‌ల్లో నెగ్గింది.  18 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.  

24: ఐపీఎల్‌ టోర్నీ ప్లే ఆఫ్స్‌ దశలో చెన్నై మొత్తం 24 మ్యాచ్‌లు ఆడింది. 15 మ్యాచ్‌ల్లో  విజయం సాధించింది. (తొలుత బ్యాటింగ్‌ చేసినపుడు 7 సార్లు... ఛేజింగ్‌ లో 8 సార్లు). మిగతా 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు