IPL 2023: రోహిత్‌ శర్మపై ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ సంచలన వ్యాఖ్యలు

28 May, 2023 07:29 IST|Sakshi
PC: IPL Twitter

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో రోహిత్‌ (7 బంతుల్లో 8) విఫలమైన అనంతరం కామెంట్రీ బాక్స్‌ ఉన్న హేడెన్‌ మాట్లాడుతూ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం రోహిత్‌ శర్మ​కు ఇది కొత్తేం ​కాదు.. జట్టుకు అవసరం ఉన్నప్పుడు అతను రాణించడం నేనెప్పుడు చూడలేదు.. అది టీమిండియా కావొచ్చు లేదా ముంబై ఇండియన్స్‌ కావచ్చు.. తన దృష్టిలో రోహిత్‌ ఒక ఫెయిల్యూర్‌ అంటూ వివాదాస్పద కామెంట్స్‌ చేశాడు.

అలాగే ఈ సీజన్‌లో ముంబై క్వాలిఫయర్‌-2 దశ వరకు చేరడంలో రోహిత్‌ పాత్ర శూన్యమని.. గత కొనేళ్లుగా అతను తరుచూ విఫలమవుతున్నా, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల ప్రదర్శన కారణంగా విమర్శల నుంచి తప్పించుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు.  హేడెన్‌ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రోహిత్‌ శర్మ అభిమానులు మండిపడుతున్నారు. రోహిత్‌ ఆడినా, ఆడకపోయినా జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడని వెనకేసుకొస్తున్నారు. రోహిత్‌ను విమర్శించే అర్హత హేడెన్‌కు లేదని ధ్వజమెత్తుతున్నారు. హిట్‌ మ్యాన్‌.. టీమిండియాకు అలాగే ముంబై ఇండియన్స్‌కు అందించిన విజయాలు మర్చిపోకూడదని అంటున్నారు.  

కాగా, మే 26న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన నాకౌట్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 62 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ సెంచరీతో (60 బంతుల్లో 129) విజృంభించడంతో గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 233 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఆదిలోనే వికెట్లు కోల్పోయి చేతులెత్తేసిన ముంబై..  మరో 10 బంతులు మిగిలుండగానే 171 పరుగులకే చాపచుట్టేసింది. కీలక మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (8) మరోసారి విఫలం కాగా.. సూర్యకుమార్‌ (61), తిలక్‌ వర్మ (43), గ్రీన్‌ (30) ఓ మోస్తరుగా రాణించడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.  

చదవండి: ‘ఫైనల్‌’ ధమాకా.. సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌

మరిన్ని వార్తలు