#MS Dhoni: నేను ఫామ్‌లో ఉన్నా! మా వాళ్లు తోపులు! చెన్నైతో మ్యాచ్‌కు ముందు గిల్‌ వార్నింగ్‌!

23 May, 2023 10:42 IST|Sakshi
శుబ్‌మన్‌ గిల్‌- ఎంఎస్‌ ధోని (PC: IPL/BCCI)

IPL 2023 Qualifier 1 GT Vs CSK: ఐపీఎల్‌-2023లో రసవత్తరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో తలపడ్డ గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మంగళవారం తొలి క్వాలిఫయర్‌ జరుగనుంది. ఈ ఎడిషన్‌లో తొలి ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో డిఫెండింగ్‌  చాంపియన్‌ గుజరాత్‌.. నాలుగుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై సై అంటే సై అంటున్నాయి.

చెన్నైలోని చెపాక్‌ వేదికగా మంగళవారం రాత్రి జరుగనున్న మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ సమ ఉజ్జీల మధ్య పోటీ అభిమానులకు కావాల్సినంత వినోదం పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్‌, శతకాల వీరుడు శుబ్‌మన్‌ గిల్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

నేను ఫామ్‌లో ఉండటం సంతోషం 
ఆర్సీబీతో ఆదివారం నాటి మ్యాచ్‌లో అజేయ సెంచరీతో గుజరాత్‌కు విజయాన్ని అందించిన గిల్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘నేను సూపర్‌ ఫామ్‌లో ఉన్నాను. సీజన్‌ ఆరంభంలో చిన్న స్కోర్లను పెద్దవిగా మలచడంలో విఫలమయ్యాను.

చెన్నైలో చెన్నైతో మ్యాచ్‌.. వావ్‌
ఎక్కువగా 40, 50లు స్కోరు చేశాను. అయితే, ఇప్పుడు మెరుగయ్యాను. అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నాను. ఇక మా తదుపరి మ్యాచ్‌ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. చెన్నైలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అంటే ఎగ్జైటింగ్‌గా ఉంది.

మా వాళ్లు తోపులు.. విజయం మాదే
మా బౌలింగ్‌ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. చెన్నై వికెట్‌పై వాళ్లు అద్భుతాలు చేస్తారని ఆశిస్తున్నా. సీఎస్‌కేను ఓడించి మేము రెండోసారి ఫైనల్‌ చేరతామని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ధోని సేనతో కీలక మ్యాచ్‌కు ముందు శుబ్‌మన్‌ గిల్‌ ఈ మేరకు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

ఇక గుజరాత్‌ ఓపెనర్‌ గిల్‌ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 680 రన్స్‌ చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో అతడు ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేయడం విశేషం.

ఆకాశమే హద్దు
మరోవైపు.. గుజరాత్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. పేసర్‌ షమీ 24 వికెట్ల(ఎకానమీ 7.70)తో పర్పుల్‌ క్యాప్‌ సంపాదించగా.. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ సైతం 24 వికెట్లు(ఎకానమీ 7.82) పడగొట్టి షమీకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ బౌలింగ్‌ విభాగం గురించి ప్రస్తావిస్తూ గిల్‌.. మా వాళ్లు తోపులు అన్నట్లు వ్యాఖ్యానించాడు. 

టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌
కాగా ఆరంభ మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లో చెన్నై.. గుజరాత్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, సొంతగడ్డపై గెలుపొంది తొలి ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుని గుజరాత్‌కు షాకివ్వాలని సీఎస్‌కే పట్టుదలగా ఉంది.  ఇక ఈ సీజన్‌లో లీగ్‌ దశలో పద్నాలుగింట 10 విజయాలు నమోదు చేసిన గుజరాత్‌ టేబుల్‌ టాపర్‌గా కాగా.. చెన్నై 8 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.

చెన్నై ఫ్యాన్స్‌ను కలవర పెడుతున్న అంశం
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు గుజరాత్‌, చెన్నై మూడుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. అయితే, ఈ మూడింటిలోనూ హార్దిక్‌ పాండ్యా సేననే విజయం వరించింది. పైగా ఈ మూడు మ్యాచ్‌లలో చెన్నై నిర్దేశించిన లక్ష్యాలను టైటాన్స్‌ ఛేజ్‌ చేసింది. ఇక చెపాక్‌ వేదికగా మాత్రం ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి.

చదవండి: నిజంగా సిగ్గుచేటు.. కఠిన చర్యలు తీసుకుంటాం! శుబ్‌మన్‌ సోదరికి అండగా..
IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్‌

మరిన్ని వార్తలు