RR VS SRH: హైడ్రామా.. ఆఖరి బంతి నో బాల్‌.. సన్‌రైజర్స్‌ సూపర్‌ విక్టరీ

8 May, 2023 06:58 IST|Sakshi
PC: IPL Twitter

చివరి బంతికి అద్భుత విజయం

215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్‌

మలుపు తిప్పిన ఫిలిప్స్‌

4 వికెట్లతో రాజస్తాన్‌ ఓటమి   

జైపూర్‌: లక్ష్యం 215 పరుగులు... 17 ఓవర్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్కోరు 171 పరుగులు. గెలవాలంటే చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి. అయితే 18వ ఓవర్లో కీలక బ్యాటర్లు రాహుల్‌ త్రిపాఠి, మార్క్‌రమ్‌లను చహల్‌ అవుట్‌ చేయడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ పైచేయి సాధించింది. కానీ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన తర్వాతి ఓవర్లో తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా మలచి గ్లెన్‌ ఫిలిప్స్‌ మ్యాచ్‌ను మళ్లీ రైజర్స్‌ చేతుల్లోకి తెచ్చాడు. ఐదో బంతికి అతను అవుట్‌ కాగా, ఆఖరి ఓవర్లో సమీకరణం 17 పరుగులుగా మారింది.

సందీప్‌ శర్మ వేసిన ఈ ఓవర్లో తొలి 5 బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. చివరి బంతికి అబ్దుల్‌ సమద్‌ను అవుట్‌ చేసి సందీప్‌ శర్మ సంబరాలు చేసుకున్నాడు. అయితే అది నోబాల్‌గా తేలింది. సన్‌రైజర్స్‌ విజయానికి ఫోర్‌ అవసరం కాగా, సందీప్‌ మళ్లీ వేసిన ఆఖరి బంతిని సమద్‌ సిక్సర్‌గా మలిచాడు! దాంతో సన్‌రైజర్స్‌ శిబిరం సంబరాల్లో మునిగిపోగా, జైపూర్‌ స్టేడియం మూగబోయింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, కెపె్టన్‌ సంజు సామ్సన్‌ (38 బంతుల్లో 66 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 81 బంతుల్లోనే 138 పరుగులు జోడించడం విశేషం. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు సాధించింది.

అభిషేక్‌ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్లెన్‌ ఫిలిప్స్‌ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సమద్‌ (7 బంతుల్లో 17 నాటౌట్‌; 2 సిక్స్‌లు) మెరుపులు జట్టును గెలిపించాయి. కీలక క్యాచ్‌లు వదిలేసి, సునాయాస రనౌట్‌ అవకాశం చేజార్చుకొని రాజస్తాన్‌ తగిన మూల్యం చెల్లించుకుంది.  

స్కోరు వివరాలు..  
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) నటరాజన్‌ (బి) జాన్సెన్‌ 35; బట్లర్‌ (ఎల్బీ) (బి) భువనేశ్వర్‌ 95; సామ్సన్‌ (నాటౌట్‌) 66; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 214.
వికెట్ల పతనం: 1–54, 2–192.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–44–1, జాన్సెన్‌ 4–0–44–1, నటరాజన్‌ 4–0–36–0, మార్కండే 4–0–51–0, అభిషేక్‌ 2–0–15–0, వివ్రాంత్‌ 2–0–18–0.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అన్‌మోల్‌ప్రీత్‌ (సి) హెట్‌మైర్‌ (బి) చహల్‌ 33; అభిషేక్‌ (సి) చహల్‌ (బి) ఆర్‌.అశ్విన్‌ 55; త్రిపాఠి (సి) యశస్వి (బి) చహల్‌ 47; క్లాసెన్‌ (సి) బట్లర్‌ (బి) చహల్‌ 26; మార్క్‌రమ్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 6; ఫిలిప్స్‌ (సి) హెట్‌మైర్‌ (బి) కుల్దీప్‌ 25; సమద్‌ (నాటౌట్‌) 17; జాన్సెన్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 217.
వికెట్ల పతనం: 1–51, 2–116, 3–157, 4–171, 5–174, 6–196.
బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4–0–48–0, కుల్దీప్‌ యాదవ్‌ 4–0–50–1, ఆర్‌. అశ్విన్‌ 4–0–35–1, చహల్‌ 4–0–29–4, మురుగన్‌ అశ్విన్‌ 3–0–42–0, మెకాయ్‌ 1–0–13–0.    

మరిన్ని వార్తలు