IPL 2024: ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన.. అతడితో తెగదెంపులు! కొత్త కోచ్‌గా..

20 Oct, 2023 17:54 IST|Sakshi
లసిత్‌ మలింగ (PC: MI)

IPL 2024- Mumbai Indians: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో తమ బ్యాటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లుగా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను నియమించుకున్నట్లు వెల్లడించింది. గతంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్‌కు ఆడినవారే కావడం విశేషం.

బ్యాటింగ్‌ కోచ్‌గా విండీస్‌ దిగ్గజం
కాగా తమ బ్యాటింగ్‌ కోచ్‌గా ముంబై ఫ్రాంఛైజీ ఇప్పటికే వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ పేసర్‌ లసిత్‌ మలింగను తమ బౌలింగ్‌ కోచ్‌గా ఎంచుకున్నట్లు తెలిపింది.

నాకు దక్కిన గౌరవం: బౌలింగ్‌ కోచ్‌ మలింగ
ఇక తన నియామకంపై స్పందించిన మలింగ.. ‘‘ఇప్పటికే ఎంఐ న్యూయార్క్‌, ఎంఐ కేప్‌టౌన్‌లతో నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమితుడిని కావడం గొప్పగా అనిపిస్తోంది. 

పోలీ, రోహిత్‌, మార్క్‌లతో పాటు జట్టు మొత్తానికి మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం వస్తుంది. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగంతో నాకు కొత్త అనుబంధం ఏర్పడుతుంది. ప్రతిభావంతులైన యువ బౌలర్లకు మార్గదర్శనం చేయడం నాకు దక్కిన గౌరవం’’ అని హర్షం వ్యక్తం చేశాడు.

షేన్‌ బాండ్‌తో తెగదెంపులు
కాగా ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా లసిత్‌ మలింగ షేన్‌ బాండ్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. తొమ్మిదేళ్లపాటు ముంబై ఇండియన్స్‌ కోచ్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ షేన్‌ బాండ్‌తో ఫ్రాంఛైజీ తెగదెంపులు చేసుకున్న తరుణంలో మలింగకు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

నాలుగుసార్లు టైటిల్‌ గెలిచిన ముంబై జట్లలో సభ్యుడు
ఇక ఆటగాడిగా మలింగ ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో భాగంగా 122 మ్యాచ్‌లు ఆడి రికార్డు స్థాయిలో 170 వికెట్లు తీశాడు.

అదే విధంగా.. 2013, 2015, 2017, 2019లో ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యుడైన మలింగ ఖాతాలో నాలుగు టైటిళ్లు ఉన్నాయి. ఇక ప్లేయర్‌గా 2021లో రిటైరైన తర్వాత మలింగ బౌలింగ్‌ కోచ్‌గా అవతారమెత్తాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు 2022, 2023 సీజన్లలో పేస్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు ముంబై క్యాంపులో పునరాగమనం చేయనున్నాడు.

చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి

మరిన్ని వార్తలు