పాపం మంచి షాట్‌ ఆడాడు కానీ గెలిపించలేకపోయాడు 

3 Jun, 2021 15:55 IST|Sakshi

డుబ్లిన్‌: కవర్‌ డ్రైవ్‌, స్క్వేర్‌లెగ్‌, స్ట్రెయిట్‌ డ్రైవ్‌, మిడాన్‌, మిడాఫ్‌.. ఇలా చెప్పుకుంటే పోతే క్రికెట్‌లో చాలా షాట్లు ఉన్నాయి. సాధారణంగా క్రికెట్‌ పుట్టినప్పటి నుంచి ఇలాంటి షాట్లను వింటూనే ఉన్నాం. కానీ  మోడ్రన్‌ క్రికెట్‌ యుగం ప్రారంభమయ్యాకా కొందరు బ్యాట్స్‌మెన్‌ ప్రత్యేక షాట్లతో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉదాహరణకు ధోని అంటే గుర్తుకువచ్చేది హెలికాప్టర్‌.. కెవిన్‌ పీటర్స్‌న్‌ అనగానే స్విచ్‌ హిట్‌.. ఏబీ డివిలియర్స్‌ ర్యాంప్‌ షాట్‌కు పెట్టింది పేరు. అయినా ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.

తాజాగా ఐర్లాండ్‌ , నెదర్లాండ్స్‌ మధ్య బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఒక బౌలర్‌ ర్యాంప్‌ షాట్‌ ఆడడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఐర్లాండ్‌ బౌలర్‌ జోషుహా లిటిల్‌ ముందు బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీశాడు.. ఆ తర్వాత బ్యాటింగ్‌ సందర్భంగా తన బౌండరీతో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ కేవలం ఒక్క పరుగు తేడాతో గెలవడం విశేషం. విషయంలోకి వెళితే.. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో  చివరి ఓవర్‌కు పది పరుగులు అవసరం అయ్యాయి. ఓవర్‌ తొలి బంతికే క్రీజులో పాతుకుపోయిన సిమీ సింగ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఐర్లాండ్‌ ఓటమి ఖాయమని అంతా భావించారు.

అయితే క్రీజులోకి వచ్చిన జోషేహా లిటిల్‌ రెండో బంతికి పరుగు తీయలేదు. ఇప్పుడు నాలుగు బంతుల్లో 9 పరుగులు కావాలి. నెదర్లాండ్స్‌ బౌలర్‌ లోగన్‌ వాన్‌ బీక్‌ మూడో బంతిని ఆఫ్‌ప్టంప్‌ బయటకు వేశాడు.  ఈ దశలో ఎవరు ఊహించని విధంగా జోషుహా షఫిల్‌ అయి ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండరీ బాదాడు. అలా ఒక బౌలర్‌ ర్యాంప్‌ షాట్‌ ఆడడం చాలా అరుదు.. దీనిని చూసిన నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. జోషుహా మరోసారి అదే షాట్‌ ప్రయత్నించగా.. ఈసారి మాత్రం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. అలా నెదర్లాండ్స్‌ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. అయితే జోషుహా షాట్‌ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 50 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. 
చదవండి: నీ పాటలో చాలా ఇంప్రూవ్‌మెంట్‌ కనిపిస్తుంది: మ్యాక్స్‌వెల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు