ఎల్‌పీఎల్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌

1 Nov, 2020 16:36 IST|Sakshi
ఇర్ఫాన్‌ పఠాన్‌(ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ: ఈ నెలలో ఆరంభం కానున్న లంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌)లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆడనున్నాడు. కండీ టస్కర్స్‌ తరఫున ఇర్ఫాన్‌ ఆడేందుకు  రంగం సిద్ధమైంది. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు ఇర్ఫాన్‌ గుడ్‌ బై చెప్పడంతో అతను విదేశీ లీగ్‌లో ఆడటానికి మార్గం సుగుమం అయ్యింది. దాంతో  లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడటానికి కండీ టస్కర్స్‌తో ఇర్ఫాన్‌ ఒప్పందం చేసుకున్నాడు. దీనిపై ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ..‘ ఈ లీగ్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. నేను టీ20 క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాను. కానీ విదేశీ లీగ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నా.  నా గేమ్‌ ఎలా ఉండబోతుందనే దానిపై నాకు ఆసక్తి ఉంది. ఎందుచేత అంటే రెండేళ్ల నుంచి క్రికెట్‌ ఆడటం లేదు. కానీ ఆడే సత్తా నాలో ఇంకా ఉంది. ఈ లీగ్‌లను మెల్లగా ఆరంభిస్తా. ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. ఇది నా రీఎంట్రీకి ఒక మార్గమని అనుకుంటున్నా. (ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్‌ ఇదేనా ?)

కరోనా వైరస్‌ కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌) ఈ నెల 14వ తేదీ నుంచి ఆరంభం కానుంది. ఈ లీగ్‌ ఆలస్యం కావడంతో క్రిస్‌ గేల్‌, డుప్లెసిస్‌ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప‍్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్‌పీఎల్‌ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్‌ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కానీ అది నవంబర్‌ 14కు వాయిదా పడింది. కరోనాతో ఆ లీగ్‌ను జరపాలా..మానాలా అనే సందిగ్థంలో ఉన్న మేనేజ్‌మెంట్‌ ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆ లీగ్‌లో గేల్‌, డుప్లెసిస్‌లతో పాటు షాహిద్‌ ఆఫ్రిది, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌లు కూడా ఆడనున్నారు. సుమారు 20 మందికి పైగా విదేశీ ఆటగాళ్లు ఆ లీగ్‌లో ఆడటానికి సుముఖుత వ్యక్తం చేయడం ఆ లీగ్‌ అదనపు అట్రాక్షన్‌ వచ్చే అవకాశం ఉంది.

ఆ లీగ్‌ ఆడే ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. అక్కడికి చేరుకున్న తర్వాత క్వారంటైన్‌ నిబంధనను పూర్తి చేసి బరిలోకి దిగాలి. ఈ లీగ్‌ను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. ఎల్‌పీఎల్‌ నిర్వహణకు ముందుగా మూడు వేదికలు అనుకోగా వాటిని రెండుకు కుదించారు. కాండీ, హమ్‌బాన్‌తోటలో లీగ్‌ జరగనుంది. నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 13వ తేదీ వరకూ ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ఎల్‌పీఎల్‌ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇదే తొలి ఎడిషన్‌ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు