Ishan Kishan: ఎంపిక చేయలేదన్న కోపమా?.. పాట రూపంలో నిరసన

10 Aug, 2022 18:46 IST|Sakshi

టీమిండియా యంగ్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు వింత పరిస్థితి ఎదురైంది. ఆసియా కప్‌ 2022కు భారత​ జట్టులో కచ్చితంగా చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. కానీ కేఎల్‌ రాహుల్‌, కోహ్లి జట్టులోకి తిరిగి ఎంపికవడం ఇషాన్‌ కొంపముంచింది. వాస్తవానికి ఇషాన్‌ మంచి ఫామ్‌ కనబరుస్తున్నప్పటికి టాపార్డర్‌లో చోటు లేకపోవడం.. మిడిలార్డర్‌లో నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉండడంతో ఇషాన్‌తో పనిలేకుండా పోయింది.

అందులోనూ కనీసం స్టాండ్‌ బై ప్లేయర్ల లిస్టులో కూడా ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే తనను ఎంపిక చేయలేదన్న కోపమో లేక ఇంకేదో తెలియదు గానీ.. ఇషాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బెల్లా హంబెల్‌ కవితను పోస్ట్‌ చేశాడు. అదంతా హిందీలో ఉన్నప్పటికి..''ఒక విషయం మీకు బాధను కలిగించినప్పటికి  మార్పు ఉండకూడదు. ఎవరైనా మిమ్మల్ని ఒక పుష్పంగా భావిస్తే.. దాన్ని తిప్పికొడుతూ ఫైర్‌గా మారండి '' అని ఇషాన్‌ చెప్పాలనుకున్న కవితకు అర్థం.

ఓపెనర్‌గా దూకుడు కనబరిచే ఇషాన్‌ కిషన్‌ ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్‌ గతేడాది వేలంలో ఇషాన్‌ను 15.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్‌ చేరడంలో విఫలమైనా ఇషాన్‌ మాత్రం 14 ఇన్నింగ్స్‌లో మూడు అర్థసెంచరీలతో 418 పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో ఆడిన ఇషాన్‌ రెండు అర్థసెంచరీలతో మెరిశాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఇషాన్‌ గత ఆరు టి20 మ్యాచ్‌ల్లో వరుసగా 27, 15, 3, 8, 11 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ల కారణంగానే ఇషాన్‌ను ఎంపిక చేయలేదని పలువురు భావిస్తున్నారు. కానీ ఈ ఏడాది ఇషాన్‌ కిషన్‌ ఇప్పటివరకు ఆడిన టి20 మ్యాచ్‌లు 14.. చేసింది 449 పరుగులు.. అంటే ఒక రకంగా ఇది తీసిపారేయాల్సిన ప్రదర్శన ‍మాత్రం కాదు.

కానీ ఆసియా కప్‌కు ఎంపికయిన కేఎల్‌ రాహుల్‌ ఇంకా ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. గురువారం జరిగే ఫిట్‌నెస్‌ టెస్టులో రాహుల్‌ పాసయితేనే ఆసియాకప్‌లో బరిలోకి దిగుతాడు. ఒకవేళ కేఎల్‌ రాహుల్‌ విఫలమైతే పరిస్థితి ఏంటనేది అంతుపట్టని ప్రశ్న. ఇటీవల ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా బ్యాటర్లు దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఓపెనర్లుగా రంగంలోకి దిగారు.

అయితే, టాపార్డర్‌లో కంటే మిడిలార్డర్‌లో వీరి అవసరం ఎక్కువగా కనిపిస్తోంది.ఒకవేళ ఏదేని కారణాల వల్ల రాహుల్‌ జట్టుకు దూరమైతే... వీరిలో ఎవరో ఒకరు ఓపెనర్‌గా వచ్చినా.. మిడిలార్డర్‌లో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అదే ఇషాన్‌ కిషన్‌ను స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపిక చేసి ఉంటే ఈ సమస్య వచ్చే అవకాశం లేదు. అయినా ఆసియా కప్‌ ప్రారంభమయ్యే వరకు ఇషాన్‌ కిషన్‌కు అవకాశాలు మిగిలే ఉన్నాయనడంలో సందేహం లేదు.

చదవండి: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్‌ స్కోరర్లను వదిలేసి..

Asia Cup 2022: కేఎల్‌ రాహుల్‌ కోలుకున్నాడు.. కానీ..! అయ్యర్‌కే ఆ ఛాన్స్‌!

మరిన్ని వార్తలు