Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్‌లో కింగ్‌ కోహ్లి

12 Dec, 2023 14:28 IST|Sakshi

రన్‌మెషీన్‌, రికార్డుల రారాజు.. టీమిండియా సూపర్‌స్టార్‌... విరాట్‌ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అద్భుత ఆట తీరుతో ఆధునిక క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలుతున్న మకుటం లేని మహారాజు..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఈ ఢిల్లీ బ్యాటర్‌.. గూగుల్‌ 25 ఏళ్ల చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. నెట్‌ ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్‌ ఇంజన్‌ అయిన గూగుల్‌లో అత్యధికసార్లు సెర్చ్‌ చేయబడిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

టాప్‌లో కింగ్‌ కోహ్లి
ఈ విషయాన్ని గూగుల్‌ అధికారికంగా వెల్లడించింది. తన 25 ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ.. మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇక అత్యధిక మంది వెదికిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి అగ్రస్థానంలో నిలవగా.. అత్యధికసార్లు సెర్చ్‌ చేయబడిన అథ్లెట్‌గా పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు.

అథ్లెట్ల జాబితాలో రొనాల్డో
అదే విధంగా మోస్ట్‌ సెర్చెడ్‌ స్పోర్ట్‌ జాబితాలో ఫుట్‌బాల్‌ టాప్‌ ర్యాంకు సొంతం చేసుకుంది. కాగా 35 ఏళ్ల విరాట్‌ కోహ్లి ఇప్పటికే క్రికెట్‌లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. సొంతగడ్డపై వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ పేరిట వన్డేల్లో ఉన్న సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. యాభై ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక సెంచరీ(50)లు చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

సోషల్‌ మీడియాలోనూ హవా
ఇదిలా ఉంటే... సోషల్‌ మీడియాలోనూ విరాట్‌ కోహ్లి తన హవా కొనసాగిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అతడు 265 మిలియన్‌ ఫాలోవర్లు కలిగి ఉన్నాడు. ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ  తర్వాత అత్యధిక అనుచర గణం కలిగిన ఆటగాడిగా కోహ్లి కొనసాగుతున్నాడు.

చదవండి: ఒకవేళ అదే జరిగితే రోహిత్‌ టాప్‌ కెప్టెన్‌ అవుతాడు! పెద్దన్నలపైనే భారం..

>
మరిన్ని వార్తలు