‘ఫాస్ట్‌ బౌలర్‌’కు భారీ షాకిచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. మ్యాచ్‌ ఆడకుండా నిషేధం

10 Nov, 2021 13:29 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

James Pattinson cops fine, one-match ban: ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ జేమ్స్‌ పాటిన్సన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా షాకిచ్చింది. ఈ స్పీడ్‌స్టర్‌ మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత పెట్టడంతో పాటుగా.. మ్యాచ్‌ నిషేధం విధించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది. కాగా షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా పాటిన్సన్‌ విక్టోరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ క్రమంలో న్యూసౌత్‌వేల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా నాలుగో రోజు ఆటలో పాటిన్సన్‌ దుందుడుకుగా ప్రవర్తించాడు. న్యూసౌత్‌ వేల్స్‌ కెప్టెన్‌ డేనియల్‌ హ్యూజెస్‌ ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇ‍వ్వకుండా డిఫెన్స్‌ ఆడాడు. పాటిన్సన్‌ బౌలింగ్‌లో అదే తరహాలో ఆటను కొనసాగించాడు. దీంతో చిరాకుపడిన పాటిన్సన్‌.. అతడి వైపుగా కోపంగా బంతిని విసరగా.. పాదానికి దెబ్బ తగిలింది. 

ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో పాటిన్సన్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం అతడి అనుచిత ప్రవర్తనను ఉపేక్షించేది లేదంటూ గట్టి చర్యలు తీసుకుంది.

కాగా పాటిన్సన్‌ ఇటీవలే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు ముందుకు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక గాయాల కారణంగా పలు సిరీస్‌లకు దూరమవడం.. అదే సమయంలో హాజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ వంటి పేసర్లు జట్టులోకి రావడంతో పాటిన్సన్‌కు అవకాశాలు సన్నగిల్లాయి.

చదవండి: #JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?!

మరిన్ని వార్తలు