T20 WC 2022: ఓటమి బాధలో ఉన్న కేన్‌ మామకు మరో భారీ షాక్‌..!

10 Nov, 2022 09:25 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వంలోని న్యూజిలాండ్‌ జట్టు.. నిన్న (నవంబర్‌ 9) జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్‌ చేతిలో ఘోర పరాజయం పొంది టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమిం‍చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కివీస్‌.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక, అదృష్టం కొద్దీ సెమీస్‌కు చేరిన పాక్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

దీంతో ఈసారైనా జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాలన్న కేన్‌ మామ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఊహించని ఈ పరాభవంతో కుమిలిపోతున్న కేన్‌ మామకు ఇంతలోనే మరో షాక్‌ తగిలిందని తెలుస్తోంది. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అతన్ని పక్కకు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతున్న కేన్‌ను రీటైన్‌ చేసుకోకుండా, వేలంలో విడుదల చేయాలని సన్‌రైజర్స్‌ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ ఓ కథనంలో పేర్కొంది.

గత సీజన్‌కు ముందు విజయవంతమైన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ను వదులుకుని కేన్‌కు పగ్గాలు అప్పజెప్పిన యాజమాన్యం.. ఇప్పుడు అతని బ్యాటింగ్‌ వైఫల్యాలు, గత సీజన్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతని ఫెయిల్యూర్స్‌ను కారణంగా చూపి ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో కేన్‌ 13 మ్యాచ్‌లు ఆడి 19.63 సగటున కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. అతని కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా సన్‌రైజర్స్‌ గత సీజన్‌ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.

ఈ అంశాలతో కేన్‌ ఆటలో వేగం లోపించడం, అతని ప్రస్తుత ఫామ్‌, టీ20 వరల్డ్‌కప్‌లో అతను ప్రాతినిధ్యం వహించిన జాతీయ జట్టు ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని వేటు వేయాలని ఎస్‌ఆర్‌హెచ్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం కేన్‌తో పాటు రొమారియో షెపర్డ్, జగదీశ్‌ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజల్‌ హక్ ఫారూఖీ, శ్రేయాస్ గోపాల్‌లను వదిలేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరిగే ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో వీరి భవితవ్యం తేలనుంది.  


 

Poll
Loading...
మరిన్ని వార్తలు