భారత్‌ను వదిలి వచ్చాను.. కానీ: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

11 May, 2021 14:47 IST|Sakshi
కెవిన్ పీటర్సన్‌(Photo Courtesy: IPL )

కెవిన్‌ పీటర్సన్‌ హిందీ ట్వీట్‌

లండన్‌: ‘‘నేను భారత్‌ను వదిలిపెట్టి వచ్చాను కానీ.. నా మనసంతా అక్కడే ఉంది. నాపై ఎంతో ప్రేమను కురిపించిన, ఆప్యాయత పంచిన దేశం గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను’’ అంటూ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఉద్వేగభరిత ట్వీట్‌ చేశాడు. కరోనా సెకండ్‌వేవ్‌తో భారత్‌ అల్లాడిపోతోందని, ఈ కష్ట సమయాన్ని ప్రజలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నాడు. దయచేసి అందరూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌ నిమిత్తం కెవిన్‌ పీటర్సన్‌ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. పలు మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అతడు.. టోర్నీ నిరవధికంగా వాయిదా పడటంతో స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కరోనా పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. ట్విటర్‌ వేదికగా సంఘీభావం ప్రకటించాడు. 

ఇక కరోనా కల్లోల పరిస్థితుల నేపథ్యంలోనూ... ‘‘నేనెంతగానో ప్రేమించే ఇండియాను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే హృదయం ముక్కలవుతోంది. కోవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడగల సత్తా భారత్‌కు ఉంది. కరుణ, ప్రే​మ కురిపించే దేశాన్ని మహమ్మారి ఏమీ చేయలేదు. ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా’’ అని కెవిన్‌ పీటర్సన్‌ భారత్‌ పట్ల అభిమానం చాటుకున్నాడు. కాగా ఐపీఎల్‌-2021లో ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు జరిగాయి. మిగిలిన 31 మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. ఇక కరోనా కేసుల విషయానికొస్తే భారత్‌లో గడిచిన 24 గంటల్లో... 3,29,942 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 3876 కరోనా మరణాలు సంభవించినట్లు తెలిపింది.

చదవండి: అమ్మా.. అక్కా.. గుండె పగిలిపోతోంది: క్రికెటర్‌ భావోద్వేగం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు