Kevin Pietersen-MS Dhoni: 'అంతా అబద్దం.. నేను ధోని తొలి వికెట్‌ను కాదు.. నేనే అతన్ని ఔట్‌ చేశాను'

17 May, 2023 18:22 IST|Sakshi
Photo: IPL Twitter

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌ కెవిన్ పీటర్సన్ కొద్దిరోజులుగా సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని గురించి ట్విటర్‌లో ట్వీట్స్‌ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇదంతా కేవలం సరదా కోసం మాత్రమే.  ధోనీ తీసిన తొలి టెస్ట్ వికెట్ తనది కాదని ఈసారి వీడియో సాక్ష్యాన్ని కూడా బయటపెట్టాడు. నిజానికి ఈ ఇద్దరి మధ్య 2017 ఐపీఎల్ సందర్భంగా తొలిసారి సరదా ఫైట్ జరిగింది.

అప్పుడు ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ టీమ్ తరఫున ఆడుతున్నాడు. ఆ సమయంలో మైక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న మనోజ్ తివారీతో.. ధోనీ కంటే నేను మంచి గోల్ఫర్ ని అని పీటర్సన్ అన్నాడు. దీనికి ధోనీ రిప్లై ఇస్తూ.. నువ్వే నా తొలి టెస్ట్ వికెట్ అని అదే మైక్ ద్వారా కేపీకి సమాధానమిచ్చాడు. కానీ ఆ రోజు డీఆర్ఎస్ తో నిర్ణయాన్ని అంపైర్ వెనక్కి తీసుకున్నట్లు పీటర్సన్ గుర్తు చేశాడు.

ఇక తాజాగా మంగళవారం (మే 16) వీడియో సాక్ష్యంతో మరో ట్వీట్ చేశాడు. 2011లో ఇంగ్లండ్లో పర్యటించింది టీమిండియా. ఆ టూర్‌లో ఒక మ్యాచ్‌లో ధోనీ బౌలింగ్ చేశాడు. ధోని వేసిన బంతి పీటర్సన్‌ను దాటుకొని వికెట్ కీపర్ ద్రవిడ్ చేతుల్లో పడింది. అందరూ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. కానీ పీటర్సన్‌ వెంటనే రివ్యూ చేయడంతో అసలు బంతి.. బ్యాట్ కు తగల్లేదని తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

ఈ వీడియోనే పీటర్సన్‌ షేర్ చేస్తూ.. "స్పష్టమైన సాక్ష్యం ఉంది. అదంతా ఫేక్‌.. నేను ధోనీ తొలి వికెట్ కాదు. కానీ ధోని నుంచి మాత్రం అది మంచి బంతి" అని క్యాప్షన్ పెట్టాడు పీటర్సన్.  అంతటితో ఆగకుండా బుధవారం (మే 17) మరో ట్వీట్ చేశాడు. నిజానికి తానే ధోనీ వికెట్ తీశానంటూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ మ్యాచ్ 2007లో ఓవల్ లో జరిగింది. అప్పటికే 92 పరుగులు చేసి సెంచరీపై కన్నేసిన ధోనీని పీటర్సన్ ఔట్ చేశాడు. అయితే ఇలా రెండు రోజులుగా పీటర్సన్ తనను ట్రోల్ చేస్తున్నా ధోనీ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి సమాధానం లేదు. 

చదవండి: హైదరాబాద్‌ బిర్యానీ మస్తుంది.. ఎస్‌ఆర్‌హెచ్‌ పని పడతం'

మరిన్ని వార్తలు