Virat Kohli: ‘నా మాట పట్టించుకోలేదు! వస్తానంటే వద్దన్నారు’: కోహ్లి షాకింగ్‌ కామెంట్స్‌.. విరాట్‌ను వద్దన్న ఫ్రాంఛైజీ కూడా ఉందా?

19 Apr, 2023 16:54 IST|Sakshi
ధోనితో విరాట్‌ కోహ్లి (ఫైల్‌ ఫొటో- PC: IPL)

Virat Kohli- RCB: టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లికి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు విడదీయరాని అనుబంధం ఉంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి.. కీలక ప్లేయర్‌గా.. అటుపై కెప్టెన్‌గా ఎదిగి.. ఆర్సీబీ అంటే కోహ్లి... కోహ్లి అంటే ఆర్సీబీ అన్నంతగా ముడిపడిపోయాడు. అలాంటి కోహ్లి పేరు లేని ఆర్సీబీని ఊహించడం కష్టం.

2013- 2021 వరకు ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించనప్పటికీ .. జట్టు అభిమానులను అలరించడంలో మాత్రం విఫలం కాలేదు. తనదైన శైలిలో దూకుడైన ఆటతో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్‌.. రోజురోజుకీ ఆర్సీబీ ఫ్యాన్‌ బేస్‌ పెంచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.

ఆర్సీబీతో ప్రయాణం అద్భుతం
ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి తాజా వెల్లడించిన ఓ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీబీతో అనుబంధాన్ని చెబుతూనే.. ఆరంభంలో తాను వేరే ఫ్రాంఛైజీకి మారాలనుకున్నానంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఈ మేరకు.. జియో సినిమా షోలో రాబిన్‌ ఊతప్పకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీతో నా ప్రయాణం అద్భుతం.

ఫ్రాంఛైజీ అంటే నాకు అమితమైన గౌరవం. ఎందుకంటే జట్టులో చేరిన తొలి మూడేళ్లలో వాళ్లు నన్ను చాలా బాగా సపోర్టు చేశారు. రిటెన్షన్‌ జరిగిన ప్రతిసారీ.. ‘‘మేము నిన్ను రిటైన్‌ చేసుకోబోతున్నాం’’ అని చెప్పేవారు.

అప్పుడు.. నేను వాళ్లకు చెప్పిన మాట ఒకటే.. ‘‘టాపార్డర్‌లో ఆడాలనుకుంటున్నా. టీమిండియాకు ఆడేపుడు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తా.. ఇక్కడ కూడా అదే చేయాలనుకుంటున్నా’’ అని విజ్ఞప్తి చేశా.

అందుకు వాళ్లు సరేనన్నారు. నాపై నమ్మకం ఉంచారు. నాకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చారు. అలా ఆర్సీబీతో పాటే నా అంతర్జాతీయ కెరీర్‌ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. నాకు వాళ్లు ఎంతో విలువ ఇస్తారు.

నా మాట పట్టించుకోలేదు
పేరైతే చెప్పను గానీ.. ఓ ఫ్రాంఛైజీతో అప్పట్లో నేను సంప్రదింపులు జరిపాను. కానీ వాళ్లు కనీసం నేను చెబుతున్నానో కూడా పట్టించుకునే స్థితిలో లేరు. అప్పట్లో నేను 5-6 స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తున్నపుడు వాళ్లతో మాట్లాడాను. ‘‘ఒకవేళ నేను మీ జట్టులోకి వస్తే టాపార్డర్‌లో ఆడిస్తారా లేదంటే వేరే ప్లేస్‌లోనా’’.. అని అడిగాను.

వాళ్లు పట్టించుకోనేలేదు. అయితే, 2011లో నేను టీమిండియా తరఫున అద్భుతంగా ఆడుతున్న తరుణంలో అదే ఫ్రాంఛైజీ వాళ్లు నా దగ్గరికి వచ్చారు. ‘ప్లీజ్‌.. వేలంలోకి రాగలరా?’’ అని నన్ను రిక్వెస్ట్‌ చేశారు. నేను కచ్చితంగా నో అని చెప్పేశాను. నాకు ఎల్లవేళలా అండగా నిలిచిన ఆర్సీబీతోనే ఉంటానని చెప్పాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు.

కోహ్లిని వద్దన్న ఫ్రాంఛైజీ ఉందా?
ఇందుకు స్పందించిన ఊతప్ప.. కోహ్లి వస్తానంటే పట్టించుకోని ఫ్రాంఛైజీ కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బదులుగా.. ‘‘అవును.. నిజం. వాళ్లు అప్పట్లో నా అభ్యర్థనను నిర్మొహమాటంగా కాదన్నారు. అదే మంచిదైంది’’ అని కోహ్లి.. ఊతప్పతో వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్‌-2023లో ఆర్బీసీ స్టార్‌ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 220 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్‌.

చదవండి: ఎట్టకేలకు టెండుల్కర్‌ అంటూ సచిన్‌ ఉద్వేగ ట్వీట్‌! నీ మనసు బంగారం షారుఖ్‌! 
SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్‌ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు! 

మరిన్ని వార్తలు