‘నా టైమ్‌ ఎప్పుడొస్తుంది’

6 Feb, 2021 05:20 IST|Sakshi

కుల్దీప్‌ యాదవ్‌ నిర్వేదం 

సాక్షి క్రీడా విభాగం:  సరిగ్గా రెండేళ్లయింది కుల్దీప్‌ యాదవ్‌ టెస్టు మ్యాచ్‌ ఆడి. నాడు సిడ్నీ టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన తర్వాత ఏ ముహూర్తాన హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ‘కుల్దీప్‌ యాదవ్‌ అద్భుత బౌలర్, అత్యుత్తమ స్పిన్నర్‌’ అంటూ ప్రశంసించాడో ఆ రోజు నుంచి అదృష్టం అతని గడప తొక్కలేదు. ఇటీవల ముగిసిన సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క వన్డే మాత్రం ఆడిన కుల్దీప్‌ సొంత గడ్డపైనైనా తన సుడి మారుతుందని ఆశించాడు. ‘స్వదేశంలో జరిగే మ్యాచ్‌లలో కుల్దీప్‌ మా ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు’ అంటూ స్వయంగా కోహ్లి గురువారమే చెప్పినా... శుక్రవారానికి వచ్చేసరికి అతనికి మరోసారి మ్యాచ్‌ దక్కలేదు.

వైవిధ్యమైన చైనామన్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కచ్చితంగా కుల్దీప్‌ ఇబ్బంది పెట్టగలడని అంతా భావించారు. అరుదుగా ఉండే ఎడంచేతి మణికట్టు స్పిన్నర్లు పిచ్‌తో సంబంధం లేకుండా ప్రభావం చూపించగలరు కాబట్టి తొలి టెస్టులో అతనికి చోటు ఖాయంగా కనిపించింది. అయితే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం తుది జట్టులో ముగ్గురూ ‘ఫింగర్‌ స్పిన్నర్‌’లకే అవకాశమిచ్చింది. అశ్విన్‌లాంటి సీనియర్‌ ఉన్నప్పుడు అదే శైలి ఉన్న సుందర్‌కు చోటు కల్పించడం ఆశ్చర్యకర నిర్ణయం. జట్టు బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకే ఇలా చేశారు అంటూ ఒక వాదన వినిపించింది.

దీని ప్రకారం కోహ్లి కచ్చితంగా జట్టులో ఒక లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఉండాల్సిందేనని పట్టు బట్టాడు. పిచ్‌లు భిన్నమైనా... ఇటీవల శ్రీలంక బౌలర్‌ ఎంబుల్‌డెనియా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించడం కూడా అందుకు ఒక కారణం. రవీంద్ర జడేజా లేకపోవడంతో అతడిని పోలిన బౌలింగ్‌ శైలి, బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యంతో అక్షర్‌ పటేల్‌ ఆడటం ఖాయమైపోయింది కూడా. అయితే అక్షర్‌ అనూహ్యంగా తప్పుకోవడంతో లెక్క మారిపోయింది. చివరి నిమిషంలో ఎంపిక చేసిన నదీమ్‌కు మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది.

కుల్దీప్‌ను కూడా ఎంపిక చేస్తే చివరి నలుగురు ఏమాత్రం బ్యాటింగ్‌ చేయలేనివారిగా మారిపోతారు కాబట్టి ఏడో స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ ఉంటే బాగుంటుందని జట్టు భావించింది. ఇటీవలి బ్రిస్బేన్‌ టెస్టు ప్రదర్శన సుందర్‌కు అదనపు అర్హతగా మారిపోయింది. దాంతో కుల్దీప్‌కు అవకాశం దక్కలేదు. అయితే చివరకు అనుభవం లేని నదీమ్, సుందర్‌లనే లక్ష్యంగా చేసి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టారు. ఇద్దరూ కలిసి 3.87 ఎకానమీతో పరుగులు ఇవ్వగా, 19 ఫోర్లు వీరి బౌలింగ్‌లోనే వచ్చాయి. బౌలింగ్‌లో సుందర్‌ను జట్టు పెద్దగా వాడుకోనే లేదు.

41వ ఓవర్‌కు గానీ బౌలింగ్‌ ప్రారంభించని అతను 12 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రత్యేక పరిస్థితుల్లో బ్రిస్బేన్‌ టెస్టు అవకాశం దక్కించుకున్న సుందర్‌... మూడున్నరేళ్ల తర్వాత స్వదేశంలో ఆడుతున్న తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కోహ్లి, పుజారా, రోహిత్, రహానే, పంత్‌లాంటి స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్న భారత జట్టు స్వదేశంలో భారీ స్కోరు కోసం ఏడో నంబర్‌ ఆటగాడి వరకు ఆధారపడుతుందా! టాప్‌–6 సరిగ్గా బ్యాటింగ్‌ చేస్తే అసలు లోయర్‌ ఆర్డర్‌ అవసరమేముంటుంది? వారు చేయలేని పనిని ఏడు, ఎనిమిదో నంబర్‌ ఆటగాళ్లు చేస్తారా!  

మూడేళ్ల తర్వాత...
భారత స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఎట్టకేలకు స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. 2018 జనవరిలో కేప్‌టౌన్‌లో అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు 17 టెస్టులు ఆడగా, అన్నీ విదేశాల్లోనే జరిగాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు