WC 2023 PAK Vs AUS: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడినపుడు చాలా నేర్చుకున్నా: సెంచరీ హీరో వార్నర్‌

21 Oct, 2023 12:42 IST|Sakshi
డేవిడ్‌ వార్నర్‌

ICC ODI WC 2023- Aus Vs Pak- David Warner Comments: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత గడ్డపై తన అద్భుత ఇన్నింగ్స్‌ వెనుక గల కారణాన్ని ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వెల్లడించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ఆడటం ద్వారా ఉపఖండ పిచ్‌లపై తనకు అవగాహన పెరిగిందని తెలిపాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సుదీర్ఘకాలం ఆడిన అనుభవం తన కెరీర్‌ పొడగింపునకు ఎంతగానో ఉపయోగపడిందని వార్నర్‌ హర్షం వ్యక్తం చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ అద్భుత శతకంతో మెరిసిన విషయం తెలిసిందే.

14 ఫోర్లు, 9 సిక్సర్లు
బెంగళూరులో మొత్తంగా 124 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌ భాయ్‌.. 14 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 163 పరుగులు సాధించాడు. ఒకదశలో డబుల్‌ సెంచరీ చేస్తాడేమో అన్నంతగా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, పాక్‌ పేసర్‌ హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో షాబాద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

భారీ స్కోరుతో జట్టుకు విజయం అందించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ డిజిటల్‌తో మాట్లాడిన డేవిడ్‌ వార్నర్‌ తన ఇన్నింగ్స్‌ పట్ల హర్షం వ్యక్తం చేశాడు. భారత పిచ్‌లపై తన సక్సెస్‌కు గల కారణాలు వెల్లడిస్తూ..

అప్పుడే చాలా నేర్చుకున్నా
‘‘ఐపీఎల్‌లో ఆడటం ద్వారా గత కొన్నేళ్లుగా నా ఆటలో ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. సన్‌రైజర్స్‌కు ఆడుతున్నపుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇలాంటి పిచ్‌లపై ఆడేటపుడు కాస్త సమయం తీసుకున్నా సరే.. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే భారీ స్కోర్లు సాధించవచ్చు.

ఈరోజు ఈ మాటలు నాకు నిజం అనిపించాయి. 35 ఓవర్ల వరకు సెటిల్డ్‌గా ఉండి.. ఆ తర్వాత స్పీడు పెంచాను. నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాను’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌ మీద డేవిడ్‌ వార్నర్‌కు బెంగళూరు శతకం వరుసగా నాలుగోది కావడం విశేషం.

సన్‌రైజర్స్‌ నుంచి అవమానకరరీతిలో
ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం పాటు సన్‌రైజర్స్‌కు ఆడిన వార్నర్‌ 2016లో జట్టును విజేతగా నిలిపాడు. కానీ, మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో అతడిని అవమానకరరీతిలో తప్పించింది యాజమాన్యం. 

అయితే, హైదరాబాద్‌ అభిమానులకు అప్పటికే వార్నర్‌ భాయ్‌గా దగ్గరైన ఈ ఆసీస్‌ ఓపెనర్‌.. ఇప్పటికీ తెలుగు హీరోల పాటలకు రీల్స్‌ చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా పాక్‌పై సెంచరీ చేసిన తర్వాత తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. కాగా గత సీజన్‌లో వార్నర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

A post shared by ICC (@icc)

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు