CWC 2023 IND VS NZ Semi Final: కలవరపెడుతున్న కోహ్లి ట్రాక్‌ రికార్డు

15 Nov, 2023 11:14 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 15) తొలి సెమీఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా​ జరుగనున్న ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు పోరాడనున్నాయి. ఈ టోర్నీలో భారత్‌ తొమ్మిది వరుస విజయాలు సాధించి భీకర ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అండర్‌ డాగ్స్‌గా పేరున్న న్యూజిలాండ్‌ను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మనవాళ్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నప్పటికీ.. కివీస్‌ను వారిదైన రోజున ఓడించడం అంత తేలక కాదు. 

మెజార్టీ శాతం సానుకూలతల నడుమ టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో కోహ్లికి ఉన్న ట్రాక్‌ రికార్డు. ప్రస్తుత టోర్నీలో అత్యుత్తమ ఫామ్‌లో ఉండి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతూ దాదాపు ప్రతి మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లి వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ అనగానే చతికిలబడతాడు. ఇప్పటివరకు కోహ్లి ఆడిన మూడు ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో ఇదే జరిగింది. 

మూడు సెమీఫైనల్స్‌లో కలిపి కోహ్లి చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. 2011 ఎడిషన్‌లో పాక్‌తో జరిగిన సెమీస్‌లో 9 పరుగులు చేసిన కోహ్లి.. 2015లో ఆ్రస్టేలియాతో జరిగిన సెమీస్‌లో ఒక్క పరుగు.. అనంతరం 2019 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్‌లో కోహ్లి ఎడంచేతి వాటం పేస్‌ బౌలర్ల (వహాబ్‌ రియాజ్, మిచెల్‌ జాన్సన్, ట్రెంట్‌ బౌల్ట్‌) చేతిలోనే ఔట్‌ కావడం విశేషం. 

ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్‌లో కోహ్లికి ట్రెంట్‌ బౌల్ట్‌ నుంచి మరోసారి ప్రమాదం పొంచి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే కోహ్లికి బౌల్ట్‌ బౌలింగ్‌లో ట్రాక్‌ రికార్డు అంతంతమాత్రంగా ఉంది. దీనికి తోడు సెమీఫైనల్‌ ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కోహ్లి ఏమేరకు రాణించగలడో అని భారత అభిమానులు కలవరపడుతున్నారు. ఈ అంశం యావత్‌ భారత దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.    

మరిన్ని వార్తలు