చెన్నైపై మిచౌంగ్‌ తుపాను దెబ్బ.. స్పందించిన వార్నర్‌! నెటిజన్లు ఫిదా

5 Dec, 2023 20:47 IST|Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు ఐపీఎల్‌ ద్వారా భారత్‌తో అనుబంధం ఏర్పడింది. చాలా కాలం పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి ఆడిన ఈ వెటరన్‌ ఓపెనర్‌.. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎప్పటికప్పుడు భారత్‌ పట్ల అభిమానం చాటుకుంటూ టీమిండియా ఫ్యాన్స్‌కు కూడా చేరువయ్యాడు.

తాజాగా చెన్నై వరదల గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మరోసారి ప్రత్యేకతను చాటుకున్నాడు వార్నర్‌. మిచౌంగ్‌ తుపాను ప్రభావం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

వరద ముంచెత్తడంతో నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్‌ క్రికెటర్లు, చెన్నైకి చెందిన దినేశ్‌ కార్తిక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రజలంతా ఇంటికే పరిమితమై సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అదే విధంగా.. సహాయక బృందాలు అవసరమైన వాళ్లకు తక్షణ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంక యువ పేసర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌ మతీశ పతిరణ సైతం ఈ క్రమంలో డేవిడ్‌ వార్నర్‌ సైతం చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు. విపత్కర పరిస్థితుల నుంచి నగరం తొందరగా బయటపడాలని ఆకాంక్షించాడు.

ఈ మేరకు.. ‘‘చెన్నైలోని చాలా వరకు ప్రాంతాలను వరదలు ముంచెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్తు కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లను చూస్తుంటే బాధ కలుగుతోంది. 

దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్లు అవసరమైన వాళ్లకు తప్పక సాయపడండి. ఎక్కడున్నా ఒకరికొకరం మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది’’అని తన అభిమానులను ఉద్దేశించి వార్నర్‌ పోస్ట్‌ చేశాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా చెన్నైలో తొలి మ్యాచ్‌ ఆడిన ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లో ఫైనల్లో గెలిచి ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్‌ను ఓడిస్తే.. తుదిపోరులో కంగారూ జట్టు రోహిత్‌ సేనపై గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ వార్నర్ ఆడిన విషయం తెలిసిందే. 

A post shared by David Warner (@davidwarner31)

>
మరిన్ని వార్తలు