Vijay Hazare Trophy: మెరుపు అర్ధశతకాలు.. విధ్వంసకర శతకం.. అతి భారీ స్కోర్‌

6 Dec, 2023 07:51 IST|Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఆరుకు పైగా రన్‌రేట్‌తో పరుగులు నమోదవుతున్నాయి. నిన్న (డిసెంబర్‌ 5) మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు రికార్డు స్థాయిలో 427 పరుగులు చేసింది. అంకిత్‌ బావ్నే విధ్వంసకర శతకంతో (105 బంతుల్లో 167; 17 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. ఓమ్‌ బోస్లే (60), కౌశల్‌ తాంబే (51), రుషబ్‌ రాథోడ్‌ (65) మెరుపు అర్ధసెంచరీలు సాధించారు.

పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లతో పాటు అజిమ్‌ ఖాజీ (36), కెప్టెన్‌ నిఖిల్‌ నాయక్‌ (33 నాటౌట్‌) కూడా మెరుపు వేగంతో పరుగులు చేయడంతో మహారాష్ట్ర జట్టు విజయ్‌ హజారే టోర్నీ చరిత్రలోనే మూడో అత్యధిక టీమ్‌ స్కోర్‌ను నమోదు చేసింది. ఈ టోర్నీలో అత్యధిక స్కోర్‌ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022 సీజన్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. అదే సీజన్‌లో పాండిచ్చేరిపై ముంబై చేసిన 457 పరుగుల స్కోర్‌ రెండో అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డైంది. 

మ్యాయ్‌ విషయానికొస్తే.. మహా బ్యాటర్ల విధ్వంసం ధాటికి మణిపూర్‌ బౌలర్‌ రెక్స్‌ సింగ్‌ 10 ఓవర్లలో 101 పరుగులు సమర్పించుకున్నాడు. మరో బౌలర్‌ ప్రియ్‌జ్యోత్‌ సింగ్‌ 9 ఓవర్లలో ఏకంగా 94 పరుగులు సమర్పించుకున్నాడు. భిష్వోర్జిత్‌ 2, కిషన్‌ సింఘా, రెక్స్‌ సింగ్‌, ప్రియ్‌జ్యోత్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

లక్ష్యం పెద్దది కావడంతో..
428 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపూర్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. లక్ష్యం పెద్దది కావడంతో మణిపూర్‌ బ్యాటర్లు ఆదిలో ఓటమిని ఒప్పేసుకున్నారు. ప్రియ్‌జ్యోత్‌ (62), జాన్సన్‌ సింగ్‌ (62), కెప్టెన్‌ లాంగ్లోన్‌యాంబా (76 నాటౌట్‌) ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. మహా బౌలర్లలో రామకృష్ణ ఘోష్‌ 2, సత్యజిత్‌, అజిమ్‌ ఖాజీ, కౌశల్‌ తాంబే తలో వికెట్‌ పడగొట్టారు. 

>
మరిన్ని వార్తలు