#LSG: ఎలిమినేటర్‌ గండం దాటలేక.. ఓటమికి కారణాలెన్నో!

25 May, 2023 00:05 IST|Sakshi
Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మరోసారి ప్లేఆప్స్‌కే పరిమితమైంది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో 81 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది. ఐపీఎల్‌లో గతేడాదే కొత్తగా వచ్చి లక్నో సూపర్‌జెయింట్స్‌ ఎలిమినేటర్‌ గండాన్ని వరుసగా రెండోసారి కూడా దాటలేకపోయింది. గతేడాది ఆర్‌సీబీ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన లక్నో.. ఈసారి ముంబై ఇండియన్స్‌కు దాసోహమంది. 

అయితే లక్నో సూపర్‌జెయింట్స్‌ ఓటమికి చాలా కారణాలున్నాయి. మొదటిది పదేపదే జట్టును మార్చడం లయను దెబ్బతీసింది. కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరీలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కృనాల్‌ పాండ్యా లీగ్‌ స్టేజీలో బాగానే నడిపించాడు. కైల్‌మేయర్స్‌ను కాదని ప్రేరక్‌ మన్కడ్‌ను తీసుకోవడం.. క్వింటన్‌ డికాక్‌కు అవకాశం ఇవ్వడం వరకు బాగానే ఉంది.

అయితే కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు డికాక్‌ను పక్కనబెట్టి కృనాల్‌ పెద్ద తప్పే చేశాడు. అసలు ఏమాత్రం ఫామ్‌లో లేని దీపక్‌ హూడాకు అవకాశమిచ్చి చేతులు కాల్చుకున్నాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా ఔట్‌ చేసి చివరకు తాను కూడా రనౌట్‌ అయి కర్మ ఫలితం అనుభవించాడు. ముంబైతో ఎలిమినేటర్‌ మ్యాఛ్‌లో  కైల్‌ మేయర్స్‌, డికాక్‌తో ఓపెనింగ్‌ చేయించి ఉంటే లక్నో పరిస్థితి వేరుగా ఉండేదేమో.

కేఎల్‌ రాహుల్‌ ఉన్నప్పుడు జట్టు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికి మిడిలార్డర్‌లో స్టోయినిస్‌, పూరన్‌లు చాలా మ్యాచ్‌ల్లో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు, అయితే కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పూరన్‌ గోల్డెన్‌ డకౌట్‌ అవ్వడం.. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న స్టోయినిస్‌ రనౌట్‌ కావడం లక్నో ఓటమిని ఖరారు చేసింది. మరి వచ్చే సీజన్‌లోనైనా సరికొత్త ప్రణాళికతో ఎలిమినేటర్‌ గండం దాటి కప్‌ కొడుతుందేమో చూద్దాం.

మరిన్ని వార్తలు