IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి వన్డే.. టీమిండియాకు బిగ్‌ షాక్‌! స్టార్‌ ఆటగాడు దూరం

3 Dec, 2022 09:54 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియా భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. భారత వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో భాగంగా మహ్మద్ షమీ చేతికి గాయమైనట్లు బీసీసీఐ ఆధికారి ఒకరు తెలిపారు. అతడికి దాదాపు రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.

ఈ క్రమంలో అతడు టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే ఛాన్స్‌ ఉంది. బంగ్లాదేశ్‌ పర్యటనకు సన్నాహాకాల్లో భాగంగా ప్రాక్టీస్‌ సెషన్‌లో షమీ చేతికి గాయమైంది. అతడు ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో ఉన్నాడు. షమీ భారత జట్టుతో కలిసి బంగ్లాదేశ్‌కు వెళ్లలేదు అని బీసీసీఐ సీనియర్‌ ఆధికారి ఒకరు పిటిఐతో పేర్కొన్నారు.

కాగా ఇప్పటికే గాయం కారణంగా జస్ప్రీత్‌ బుమ్రా దూరం కాగా.. తాజాగా సీనియర్‌ పేసర్‌ షమీ గాయం బారిన పడడం జట్టు మేనేజేమెంట్‌ను కలవరపెడుతోంది. ముఖ్యంగా టెస్టు సిరీస్‌కు షమీ దూరమైతే అది భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు పోటీలో నిలవాలంటే టీమిండియా ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలి. కాబట్టి షమీ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు జట్టులో ఉండాలి.

ఇక షమీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో వేచి చూడాలి. బంగ్లా పర్యటనలో భాగంగా భారత్‌తో బంగ్లాదేశ్‌ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం(డిసెంబర్‌ 4)న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. 
చదవండిIND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌గా లిటన్‌ దాస్‌

మరిన్ని వార్తలు