MS Dhoni T20 World Cup Mentor: కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌.. మరి మెంటార్‌గా..

9 Sep, 2021 08:51 IST|Sakshi

సాక్షి,వెబ్‌డెస్క్‌: ఎంఎస్‌ ధోని.. క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడాది కావొస్తున్నా అతని క్రేజ్‌ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. టీమిండియాకు మూడు మేజర్‌ ఐసీసీ టోర్నీ టైటిల్స్‌ అందించిన ధోనికి కెప్టెన్‌గా మంచి సక్సెస్‌ ట్రాక్‌ ఉంది. ఆటకు దూరమైనా అతనిచ్చే సలహాలు ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లకు ఉపయోగంగా మారుతాయి. అందుకేనేమో.. ఎలాగైనా 2021 టీ 20 ప్రపంచకప్‌ కొట్టాలని భావించిన టీమిండియా ఎంఎస్‌ ధోనిని మెంటార్‌గా ఎంపికచేసింది. మరి ధోని మెంటార్‌గా టీమిండియా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ పట్టుకొస్తుందా అనేది చూడాలి.

చదవండి: T20 World Cup 2021: టీమిండియా జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని

ఆరంభమే ఒక అద్భుతం
2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర ప్రదర్శన అందరికి గుర్తుండే ఉంటుంది. రాహుల్‌ ద్రవిడ్‌ సారధ్యంలోని టీమిండియా లీగ్‌లో బెర్ముడాపై విజయం మినహా మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసి తొలిరౌండ్‌లోనే నిష్ర్కమించింది. ఈ విషయం అభిమానులకు మింగుడుపడలేదు. చాలాకాలం పాటు టీమిండియా చెత్త ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక అప్పుడప్పుడే టీ20 ఫార్మాట్‌ క్రికెట్‌లో సంచలనాలు చేస్తుంది. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తే.. అభిమానులకు మరింత మజా లభిస్తుందని భావించిన ఐసీసీ అదే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలని భావించింది. టీమిండియాకు ఇక్కడే సమస్య మొదలైంది.

చదవండి: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు

టీ20 ప్రపంచకప్‌కు వెళ్లే టీమిండియా జట్టులో అంతా యువరక్తంతో నిండి ఉండాలని బీసీసీఐ భావించింది. జట్టులోని సీనియర్లకు సెలవిస్తూ మొత్తం జట్టునంతా యువకులతో నింపేసింది. ఈ జట్టును నడిపించడానికి ఎంఎస్‌ ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా తొలి ప్రపంచకప్‌లోనే అద్భుతాలు చేసింది. ధోని కెప్టెన్సీలో ఆ ప్రపంచకప్‌లో భారత్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాలు సాధిస్తూ వచ్చింది. ఇక ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్‌ను జోగిందర్‌ శర్మతో వేయించడం.. శ్రీశాంత్‌ క్యాచ్‌ పట్టడం.. టీమిండియా గెలవడం చకచకా జరిగిపోయాయి. అలా ఆరంభంలోనే ఒక అద్భుతాన్ని చేసి చూపించాడు.

మ్యాచ్‌లో ఉన్నప్పడు ధోని బ్రెయిన్‌ ఎంత చురుకుగా ఉంటుందనేది ఒక ఉదాహరణ. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు ధోని తర్వాతి కాలంలో చాలానే తీసుకున్నాడు. తన సలహాలతో ఎంతో మంది యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశాడు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించాడు. అయితే 2007 టీ20 ప్రపంచకప్‌ను పునరావృతం చేసే అవకాశం ధోనికి మరోసారి రాలేదు. ఐదుసార్లు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని టైటిల్‌ అందించడంలో మాత్రం విఫలమయ్యాడు. మరి అలాంటి ధోనికి ఇప్పుడు మెంటార్‌గా బాధ్యతలు అప్పగించడం వరకు బాగానే ఉంది. మరి ఆ బాధ్యతను ధోని సక్రమంగా నిర్వర్తిస్తాడా అనేది ఆసక్తికరం.  


ఇక ఐపీఎల్‌ మినహా రెండేళ్లుగా టీమిండియాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్న అతను... బోర్డు కార్యదర్శి జై షా విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీ కోసం ‘మెంటార్‌’గా ఉండేందుకు అంగీకరించాడు. కెప్టెన్‌, కోచ్‌లతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా వెల్లడించారు. అయితే రవిశాస్త్రి రూపంలో హెడ్‌ కోచ్, టాప్‌ ప్లేయర్‌ కోహ్లి కెప్టెన్‌గా ఉన్న టీమ్‌కు అదనంగా ధోని మార్గనిర్దేశనం అవసరమా అనేదే చర్చనీయాంశం! 

చదవండి: MS Dhoni: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా

మరిన్ని వార్తలు