CWC 2023: సచిన్‌ విగ్రహంపై అభిమానుల అసంతృప్తి

3 Nov, 2023 11:16 IST|Sakshi

ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్తగా ఏర్పాటైన సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహంపై భారత క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ విగ్రహం ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను పోలి ఉండటంతో సచిన్‌ అభిమానులు పెదవి విరుస్తున్నారు. సచిన్‌ విగ్రహాన్ని సరిగ్గా రూపొందింలేదని విగ్రహ రూపకర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యావత్‌ భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కీర్తించే సచిన్‌ విగ్రహాన్ని తయారు చేసేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని తాయారు చేసి ఉండాల్సిందని విగ్రహ రూపకర్తను దూషిస్తున్నారు. సచిన్‌ అంటే గిట్టని వారు, క్రికెట్‌ పరిజ్ఞానం లేని వారు స్టీవ్‌ స్మిత్‌ విగ్రహం భారత్‌లో ఉందేందంటూ వ్యంగ్యమైన కామెంట్స్‌ చేస్తున్నారు. వాంఖడేలో నిన్న భారత్‌-శ్రీలంక మధ్య మ్యాచ్‌ జరిగినప్పటికీ నుంచి సచిన్‌ విగ్రహం పెద్ద చర్చనీయాంశమైంది. 

కాగా, నవంబర్‌ 1న ప్రతిష్టాత్మక వాంఖడే మైదానంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వాంఖడేలో సచిన్‌ స్టాండ్‌ పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్‌ ఆఫ్‌సైడ్‌ షాట్‌ ఆడే పోజ్‌లో ఈ విగ్రహాన్ని డిజైన్‌ చేశారు. 

అహ్మదాబాద్‌కు చెందిన ప్రమోద్‌ కాంబ్లే ఈ విగ్రహాన్ని రూపొందించారు. సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా విగ్రహావిష్కరణ చేశారు. కాగా, సచిన్‌ తన సొంత మైదానమైన వాంఖడేలో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ (నవంబర్‌ 16, 2013) ఆడిన విషయం తెలిసిందే.  

ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్‌ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. గిల్‌ (92), కోహ్లి (88), శ్రేయస్‌ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్‌ షమీ (5-1-18-5), మొహమ్మద్‌ సిరాజ్‌ (7-2-16-3), జస్ప్రీత్‌ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్‌ రజిత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మరిన్ని వార్తలు