CWC 2023: టీమిండియా ఆఖరి వరకు అజేయంగా నిలవడం ఖాయం! అయితే..: విండీస్‌ లెజెండ్‌

11 Nov, 2023 13:53 IST|Sakshi

ICC WC 2023- Team India: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ అన్నాడు. ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగిస్తూ టైటిల్‌ కైవసం చేసుకుంటుందని అభిప్రాయపడ్డాడు.

అయితే, ఈ ప్రయాణంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు దరిచేరనీయొద్దని రోహిత్‌ సేనకు విజ్ఞప్తి చేశాడు. అలా అయితే మొదటికే మోసం వస్తుందని విండీస్‌ లెజెండరీ ఆల్‌రౌండర్‌ రిచర్డ్స్‌ హెచ్చరించాడు. కాగా ప్రపంచకప్‌-2023లో లీగ్‌ దశలో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలోనూ టీమిండియా జయకేతనం ఎగురవేసింది.

ఈ క్రమంలో ఇప్పటికే టేబుల్‌ టాపర్‌గా సెమీస్‌ చేరిన రోహిత్‌ సేన..  లీగ్‌ దశలో మిగిలిన ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భారీ విజయంతో అజేయంగా నిలవాలని పట్టుదలగా ఉంది. నెదర్లాండ్స్‌ వంటి పసికూనతో మ్యాచ్‌లో భారత జట్టుకు ఇదేమీ అంతకష్టమని పనికాదు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అంటేనే
ఇదిలా ఉంటే.. తొలి సెమీ ఫైనల్లో టీమిండియాతో తలపడేందుకు న్యూజిలాండ్‌ సిద్ధమైంది. శ్రీలంకపై ఘన విజయంతో అనధికారికంగా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్న కివీస్‌.. రోహిత్‌ సేనతో తలపడటం దాదాపుగా ఖాయమైపోయింది.

అయితే, 2015, 2019 టోర్నీల్లో టీమిండియాకు న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి ఏం జరుగుతుందోననే ఆందోళన అభిమానులను వెంటాడుతోంది. ఈ క్రమంలో వివియన్‌ రిచర్డ్స్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అలా అయితేనే ఆఖరి వరకు అజేయంగా
ఐసీసీ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా చివరి దాకా అజేయంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అయితే, కొన్నిసార్లు.. ‘మేము ఇక్కడిదాకా బాగానే ఆడాం.. కానీ సెమీ ఫైనల్లో ఏం జరుగుతుందో’ అనే భయాలు ఉండటం సహజం.

కానీ ఇలాంటి ప్రతికూల అంశాల గురించి ఎంత పక్కనపెడితే అంత మంచిది. ఇప్పటిదాకా ఆత్మవిశ్వాసంతో ఎలా ఆడారో ఇక ముందు కూడా అలాగే ఆడాలి. వాళ్ల మైండ్‌సెట్‌లో ఎలాంటి మార్పూ రాకూడదు’’ అని వివియన్‌ రిచర్డ్స్‌ పేర్కొన్నాడు. నెగటివ్‌గా అనిపించే ప్రతి విషయాన్ని భారత ఆటగాళ్లు పక్కనపెట్టాలని ఈ సందర్భంగా సూచించాడు.

చదవండి: కానిస్టేబుల్‌ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్‌ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే! 
పాక్‌కు సెమీస్‌ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్‌ 

మరిన్ని వార్తలు