WC 2023: వారిద్దరే మా ఓటమిని శాసించారు.. చాలా బాధగా ఉంది! కానీ: బట్లర్‌

6 Oct, 2023 07:54 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023ను డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ ఘోర ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ పరాజయం పాలైంది. బ్యాటింగ్‌లో పర్వాలేదన్పించిన ఇంగ్లీష్‌ జట్టు.. బౌలింగ్‌లో మాత్రం చేతిలేత్తేసింది. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి 36.2 ఓవర్లలలోనే కివీస్‌ ఛేదించింది.

కివీస్‌ బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్‌ కాన్వే(152), రచిన్‌ రవీంద్ర(123) ఆజేయ శతకాలతో చెలరేగారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కర్రాన్‌ తప్ప మిగితా ఎవరూ వికెట్‌ సాధించలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 283 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జో రూట్‌(77) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ స్పందించాడు. తమ బ్యాటింగ్‌ తీరు పట్ల బట్లర్‌ ఆసహనం వ్యక్తం చేశాడు.

వారిద్దరూ అద్బుతం
"తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలవ్వడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. అయితే ఈ టోర్నీలో మాకు ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ ఓటమిని ఎంతవేగం మర్చిపోతే అంతమంచిది. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే చాలా క్రికెట్‌ ఆడారు. ఇంతకు ముందు చాలా జట్లను ఈ విధంగానే మేము ఓడించాము. అదే విధంగా ఇటువంటి పరాజయాలు గతంలో కూడా మాకు ఎదురయ్యాయి.

కానీ ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో అద్బుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చి విజయాలను సాధించాము. మేము ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పరంగా మెరుగైన ప్రదర్శన చేయలేదు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను చూసి ఈ మాట చెప్పడం లేదు. ఎందుకంటే వికెట్‌ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. మేము ఈ పిచ్‌పై 330 పరుగులు చేయాల్సింది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. కీలక భాగస్వామ్యం నెలకొల్పడం చాలా కష్టం.

కానీ మేము సరైన ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా బ్యాటింగ్‌లో చెత్త షాట్‌ సెలక్షన్‌తో వికెట్లను కోల్పోయాం. అయితే ఈ టోర్నీలో మేము పాజిటివ్‌గా ఆడాల్సిన అవసరం ఉంది. మరీ డిఫెన్సీవ్‌గా ఆడాల్సిన పని కూడా లేదు. మా శైలిలోనే మేము ఆడుతాం. కానీ న్యూజిలాండ్‌ మాత్రం అద్బుతంగా ఆడింది. వారు షాట్‌ సెలక్షన్స్‌ కూడా చాలా బాగుంది.

అందుకు తగ్గట్టు ప్రతిఫలం కూడా దక్కింది. కాన్వే లాంటి  ఆటగాడు భారీ షాట్లు ఆడలేదు, కానీ తన బ్యాటింగ్‌ టెక్నిక్‌తో చాలా త్వరగా పరుగులు సాధించాడు. రచిన్ రవీంద్ర కూడా ఆ విధంగానే ఆడాడు. వీరి నుంచి మేము ఇటువంటి ప్రదర్శన వస్తుందని అస్సలు ఊహించలేదు. వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అదే మా ఓటమిని శాసించింది.

ఫ్లడ్ లైట్స్ కింద బౌలింగ్ చేయడం కష్టమనే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ అది జరగలేదు. ఇక జోరూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు ఫామ్‌పై మాకు ఎటువంటి సందేహం లేదు. అతను ఏ ఫార్మాట్‌లో ఆడినా రన్ మిషన్‌. స్టోక్స్‌ కూడా ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆశిస్తున్నామని" పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో బట్లర్‌ పేర్కొన్నాడు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు