IPL 2024: క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు దూరం కానున్న స్టార్‌ పేసర్‌.. కారణం ఇదే

4 Dec, 2023 19:34 IST|Sakshi
జోఫ్రా ఆర్చర్‌ (PC: IPL/MI)

ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ విషయంలో ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగం కావొద్దని అతడికి ఈసీబీ సూచించినట్లు తెలుస్తోంది. కాగా బార్బడోస్‌కు చెందిన 28 ఏళ్ల రైటార్మ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌.. ఐపీఎల్‌-2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

గతేడాది అతడిని ఎనిమిది కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది ముంబై ఫ్రాంఛైజీ. గాయం కారణంగా ఐపీఎల్‌-2022 సీజన్‌  మొత్తానికి దూరమవుతాడని తెలిసినా పెద్ద మొత్తం అతడి కోసం పక్కకు పెట్టింది.

అయితే, ఐపీఎల్‌-2023కి అతడు అందుబాటులోకి వచ్చినా.. ఆశించిన మేర ఆర్చర్‌ సేవలను వినియోగించుకోలేకపోయింది. గాయాల బెడద కారణంగా అతడు సింహభాగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజా ఎడిషన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్‌.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

తనపై ఖర్చు పెట్టిన మొత్తానికి న్యాయం చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2024 వేలానికి ముందు ముంబై అతడిని విడుదల చేసింది. అయితే, ఆర్చర్‌ వేలంలో పాల్గొనాలని భావించినా ఈసీబీ అందుకు అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు..‘‘ఆర్చర్‌ పునరాగమనం చేయాలని కోరుకుంటున్న ఈసీబీ.. అతడిని ఏప్రిల్‌, మే మొత్తం తమ పర్యవేక్షణలోనే ఉండాలని భావిస్తోంది. ఒకవేళ అతడు వేలంలో పాల్గొంటే కచ్చితంగా ఏదో ఒక ఐపీఎల్‌ జట్టు అతడిని కొనుగోలు చేయడమే కాకుండా ఖర్చు తగ్గ ఫలితం పొందాలని ఆశిస్తుంది. 

కాబట్టి.. వరల్డ్‌కప్‌-2024 జూన్‌లోనే ప్రారంభమవుతున్న కారణంగా పని భారాన్ని తగ్గించుకునే వీలు ఉండకపోవచ్చు. అందుకే అతడు ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నాడు’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ఫో తన కథనంలో పేర్కొంది.

కాగా జోఫ్రా ఆర్చర్‌ టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు ఈసీబీతో రెండేళ్లకు గానూ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆర్చర్‌కు ఈసీబీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2023 కోసం భారత్‌కు వచ్చిన జోఫ్రా ఆర్చర్‌ మోచేయి గాయం కారణంగా..వారంలోపే తిరిగి యూకేకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి తమ పేసర్‌ ఫిట్‌నెస్‌ విషయంలో రిస్క్‌ తీసుకునేందుకు బోర్డు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

>
మరిన్ని వార్తలు