ఐపీఎల్‌-2024 షెడ్యూల్‌ విషయంలో బీసీసీఐకి తలనొప్పులు! ఈసారి ఇక్కడ కష్టమే?

1 Dec, 2023 17:00 IST|Sakshi
ఐపీఎల్‌ ట్రోఫీ (PC: IPL/BCCI)

IPL 2024: క్రికెట్‌ ప్రేమికులకు ఏటా కావాల్సినంత వినోదం పంచుతోంది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. ప్రపంచంలోనే ధనిక టీ20 లీగ్‌గా పేరొందిన ఈ మెగా టోర్నీని ప్రతి ఏడాది ప్రథమార్థం ముగింపు దశలో నిర్వహిస్తోంది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి. 

అయితే, ఈసారి మాత్రం ఐపీఎల్‌ షెడ్యూల్‌ విషయంలో బీసీసీఐకి తలనొప్పులు తప్పేలా లేవు. ఓవైపు లోక్‌సభ ఎన్నికలు.. మరోవైపు టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో క్యాష్‌రిచ్‌ లీగ్‌ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం.

కాగా సాధారణ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో దేశ, విదేశాల నుంచి వచ్చే స్టార్‌ క్రికెటర్లు పాల్గొనే ఐపీఎల్‌ కూడా నిర్వహించడం కత్తిమీద సాములాంటిదే.

లోక్‌సభ ఎన్నికల నగారా మోగిన తర్వాతే
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ షెడ్యూల్‌ను వాయిదా వేయాలని భావిస్తే జూన్‌ 4 నుంచి టీ20 ప్రపంచకప్‌ రూపంలో ఐసీసీ ఈవెంట్‌ అడ్డుతగులుతుంది. దీంతో ఈసారి ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ విషయంలో ఐపీఎల్‌ పాలకమండలి లోక్‌సభ ఎన్నికల నగారా మోగే వరకు ఎదురుచూసి అంతిమ నిర్ణయం తీసుకోనున్నట్లు పీటీఐ వెల్లడించింది.

గతంలో సౌతాఫ్రికా, యూఏఈలో
కాగా 2009, 2014, 2019 సాధారణ ఎన్నికల సమయంలో కూడా ఐపీఎల్‌ నిర్వహణ విషయంలో ఇలాంటి సమస్యలే తలెత్తాయి. రెండో ఎడిషన్‌(2009)లో వేదికను మొత్తంగా సౌతాఫ్రికాకు తరలించగా.. ఏడో సీజన్‌(2014)లో మొదటి సగం మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నిర్వహించారు.

ఇక 2019లో తొలి 19 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌.. ఎన్నికల తేదీల విషయంలో స్పష్టత వచ్చాక మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించి ఇండియాలోనే టోర్నీని నిర్వహించింది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 19 ఐపీఎల్‌-2024 మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే.

చదవండి: బీసీసీఐ అలా చేస్తే.. అంత‌కంటే పిచ్చిత‌నం మ‌రొక‌టి ఉండ‌దు: ర‌సెల్‌

మరిన్ని వార్తలు