Prithvi Shaw: పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్‌.. 129 బంతుల్లో 200! కానీ... ఆ లిస్టులో మాత్రం..

10 Aug, 2023 07:44 IST|Sakshi

Prithvi Shaw Slams Double Century- Fans Reacts- లండన్‌: ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో తొలిసారి ఆడుతున్న భారత క్రికెటర్‌ పృథ్వీ షా దేశవాళీ వన్డే కప్‌లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

153 బంతులు ఆడిన పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 244 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అవుటయ్యాడు. పృథ్వీ షా అసాధారణ బ్యాటింగ్‌తో మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు సాధించింది. అనంతరం సోమర్‌సెట్‌ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై 87 పరుగుల తేడాతో ఓడిపోయింది.  

రికార్డుల పృథ్వీ
నార్తంప్టన్‌షైర్‌ జట్టు తరఫున మూడో మ్యాచ్‌ ఆడిన పృథ్వీ షా 81 బంతుల్లో సెంచరీ చేయగా... డబుల్‌ సెంచరీని 129 బంతుల్లో దాటాడు. ముంబైకి చెందిన పృథ్వీ షాకిది లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) రెండో డబుల్‌ సెంచరీ కావడం విశేషం.

 లిస్ట్‌ ‘ఎ’లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల  లిస్టులో మాత్రం..
జాబితాలో పృథ్వీ షాది ఆరో స్థానం. ఈ జాబితాలో తమిళనాడు క్రికెటర్‌ నారాయణ్‌ జగదీశన్‌ (277; అరుణాచల్‌ప్రదేశ్‌పై 2022లో) టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు.  

అప్పటి నుంచి నో ఛాన్స్‌!
2021లో భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై పృథ్వీ షా 227 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2021 జూలైలో చివరిసారి శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత ఫామ్‌ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు.

ఇక తాజాగా ఇంగ్లండ్‌లో అతడు బ్యాట్‌ ఝులిపించడంతో టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మన వాళ్ల ప్రతిభను మనం గుర్తించకపోతే ఇదిగో ఇలాగే పక్క దేశాల్లో ఆడుకుంటారంటూ ఫైర్‌ అవుతున్నారు. ఇకనైనా పృథ్వీ వంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.

చదవండి: మా కెప్టెన్‌ గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే..

మరిన్ని వార్తలు