Indian Wrestlers' Protest: విమర్శలపాలై.. ఆలస్యంగానైనా వచ్చిన ఉష! కానీ చేదు అనుభవం!?

4 May, 2023 08:26 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై తాము చేసిన లైంగిక ఆరోపణల విషయంలో మహిళా రెజ్లర్లు తమ వాదనలకు సంబంధించి కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తాము ఈ సమాచారాన్ని గురువారం సీల్డ్‌ కవర్‌లో అందిస్తామని ఏడుగురు రెజ్లర్లు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన బెంచీ దీనికి అంగీకరించింది. ఈ అఫిడవిట్‌ కాపీని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు కూడా అందించేందుకు తాము సిద్ధమని, అయితే దీనిని బహిరంగపర్చవద్దని రెజ్లర్ల తరఫు న్యాయవాది కోరారు.

ప్రస్తుతం కేసు విచారణలో ఉంది కాబట్టి విచారణాధికారికి మాత్రం దీనిని అందించవచ్చా అని మెహతా అడగ్గా... అభ్యంతరం లేదని బెంచీ సభ్యులు స్పష్టం చేశారు. గత శుక్రవారం బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.  

హామీ ఏమీ లేదు! 
భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఎట్టకేలకు రెజ్లర్లను కలిసింది. గత వారం రెజ్లర్ల నిరసన కారణంగా దేశం పరువు పోతోందంటూ వ్యాఖ్య చేసి విమర్శలపాలైన ఉష తాజా భేటీ ఆసక్తిని రేపింది. వారితో ఏం చర్చించిందనే అంశంపై పూర్తి స్పష్టత లేకున్నా... అధికారికంగా ఐఓఏ అధ్యక్షురాలి హోదాలో ఉష నుంచి రెజ్లర్లకు ఎలాంటి హామీ మాత్రం లభించలేదు.

పీటీ ఉషకు చేదు అనుభవం
‘ఆలస్యంగానైనా ఉష ఇక్కడకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఐఓఏ అధ్యక్షురాలికంటే ముందు తాను అథ్లెట్‌నని ఆమె చెప్పారు. మాకు న్యాయం కావాలని, రెజ్లింగ్‌ మేలు కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పాం. మా పరిస్థితి చూస్తే బాధేస్తుందంటూ సంఘీభావం తెలిపారు.

అయితే తక్షణ పరిష్కారం గురించి మాత్రం ఆమె ఏమీ చెప్పలేదు’ అని రెజ్లర్లు వెల్లడించారు. మరోవైపు ఉషపై ఒక మహిళ దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఉషపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపదెబ్బ కొట్టినట్లుగా ఒక వీడియో కనిపిస్తున్నా... దానిపై స్పష్టత లేదు.

మరోవైపు బుధవారం రాత్రి రెజ్లర్లు నిరసన చేస్తున్న జంతర్‌ మంతర్‌ వద్దకు ఢిల్లీ పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి రెజ్లర్లను తరలించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.  

చదవండి: ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ అథ్లెట్‌.. 32 ఏళ్ల టో­రి బోవి హఠాన్మరణం 

మరిన్ని వార్తలు