మెంటల్‌ ఫిట్‌నెస్‌ కోసం స్పెషల్‌ యాప్‌ 

10 Dec, 2020 08:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ క్రీడాకారులు కీలక మ్యాచ్‌లకు ముందు తీవ్ర ఒత్తిడికి లోను కావడం, మ్యాచ్‌లో ఒకవేళ ఓటమి ఎదురైతే కుంగిపోవడం తరచుగా జరుగుతుంది. ఎలాంటి ఆందోళనకు లోను కాకుండా ఆటను ఆటగానే చూడాలంటే మానసికంగా ఎంతో దృఢత్వం అవసరం. ఇందు కోసం ధ్యానం ఎంతో సహకరిస్తుందని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ చెబుతున్నారు. అందు కోసం స్వయంగా తానే మెంటల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా మారి సూచనలివ్వబోతున్నారు. ఇందు కోసం ఆయన ‘ధ్యాన ఫర్‌ స్పోర్ట్స్‌’ అనే యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఏడాది క్రితం గోపీచంద్‌ స్వయంగా ప్రారంభమైన ‘ధ్యాన’ యాప్‌లోనే ఇప్పుడు ప్రత్యేకంగా క్రీడాకారుల కోసం మెడిటేషన్‌ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు.

దేశంలోని ప్రఖ్యాత షట్లర్లు ఇప్పటికే దీనిని అనుసరిస్తున్నారని, ఇతర క్రీడాకారులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గోపీచంద్‌ వెల్లడించారు. ఒక ఆటగాడిగా తాను అన్ని అంశాలపై అధ్యయనం చేసిన తర్వాత ఈ మెడిటేషన్‌ యాప్‌ను రూపొందించామని, చాంపియన్లుగా మారే క్రమంలో మానసిక ప్రశాంతత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన అన్నారు. ‘ధ్యాన ఫర్‌ స్పోర్ట్స్‌’లో పది రకాల వేర్వేరు సెషన్లు అందుబాటులో ఉన్నాయి. ‘ధ్యాన’ ద్వారా మెడిటేషన్‌లో భాగమయ్యేందుకు ఉపయోగించాల్సిన ప్రత్యేక కిట్‌ అమెజాన్‌లో లభిస్తుందని గోపీచంద్‌ చెప్పారు. మీడియా సమావేశంలో గోపీతో పాటు అవంతరి టెక్నాలజీస్‌ ఎండీ భైరవ్‌ శంకర్, భారత అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు