అమ్మాయిలూ.. జర జాగ్రత్త!: హైదరాబాద్ సీపీ శాండిల్య

11 Nov, 2023 16:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో అపరిచితులపట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య. అమ్మాయిలు వీలైనంత వరకు తమ ఫొటోలు, వివరాలను పోస్ట్‌ చేయొద్దని కోరారాయన. శనివారం నగర శాంతి భద్రతల అంశంపై ప్రెస్‌మీట్‌ నిర్వహించిన  ఆయన‌.. తాజాగా నగర పోలీసులు చేధించిన సైబర్‌ నేరాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ సూచన చేశారు. 


కేసు వివరాలు.. 
సోషల్‌ మీడియాలో నగరానికి చెందిన ఇద్దరు బాలికలను కొందరు ఆగంతకులు ట్రాప్‌ చేశారు. ఈ మూడు నెలలుగా వాళ్ల మధ్య ఛాటింగ్‌ వ్యవహారం నడిచింది. బాలికల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేశారు ఆ కేటుగాళ్లు. చివరకు.. కోరికలు తీర్చకపోతే ఇంటర్నెట్‌లో ఆ ఫొటోలు, వీడియోలు పెడతామని బెదిరించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని ట్రాప్‌ చేసి మరీ పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ కేసులపై సీపీ శాండిల్య మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ సీపీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రెండు కేసులు నా దృష్టికి వచ్చాయి. ఈ రెండింటిలోనూ యువతులే బాధితులుగా ఉన్నారు. వాళ్ల ఫొటోల్ని మార్ఫింగ్‌ చేసి దుండగులు బ్లాక్‌మెయిల్‌ చేశారు. ఆ బెదిరింపులతోనే అత్యాచారం చేశారు. ఈ రెండు ఘటనలు యువతులు ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకోవడం వల్లే.. అపరిచితులతో ఛాటింగ్‌ చేయడం వల్లే జరిగాయి. కాబట్టి ఎవరూ అలాంటి ట్రాప్‌ల్లో పడొద్దు.. బాధితులు కావొద్దు అని అన్నారాయన.  

మేమున్నాం.. 
‘‘సోషల్‌ మీడియా పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అకౌంట్‌లలో వ్యక్తిగత ఫొటోలు పెట్టొద్దు. ఒకవేళ పెట్టినా సోషల్‌ మీడియాలో ప్రొఫైల్‌ లాక్‌ పెట్టుకోండి. అపరిచితుల నుంచి రిక్వెస్ట్‌ వస్తే అంగీకరించవద్దు. ప్రొఫైల్‌ను రెండు దశలుగా సెక్యూర్‌ పెట్టుకోండి. స్నేహితులతో, అపరిచితులతో వీడియో కాలింగ్‌ చేయొద్దు. ఎవరైనా బ్లాక్‌మెయిల్‌, ఒత్తిడి చేస్తే ఆందోళన చెందకండి. మీకు మేమున్నాం. ఎవరైనా ఇబ్బందులు పెడితే మా అన్న పోలీసు అని చెప్పండి. నేరుగా మా నెంబర్లను సంప్రదించండి.. 

ఫోన్‌ నెంబర్లు.. 9490616555, 8712660001

అమ్మాయిలు, మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే.. ఫిర్యాదు చెయ్యండి. పోలీసులను మీ సోదరులుగా భావించండి. నన్ను(కమిషనర్‌ శాండీ తనను తాను ఉద్దేశించుకుంటూ..) మీ అన్నగా భావించండి. మీ ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారాయన.


తల్లిదండ్రులకు సూచన
బీదర్‌ నుంచి మత్తు ట్యాబెట్లు తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నారు. ఆ ముఠా విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుంటోంది. బీదర్‌కు నిందితుల్ని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు పోలీసులపై నిందితులు దాడి చేశారు. దాడుల్లో నార్కోటిక్‌ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. పిల్లల తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఒక్కటే. వాళ్లతో కలిసి ఉండండి.. ఒంటరిగా వాళ్లను వదిలేయకుండా దృష్టి పెట్టండి. 

మరిన్ని వార్తలు