PV Sindhu-Carolina: బాక్సింగ్‌ కోర్టు కాదు.. బ్యాడ్మింటన్ కోర్టు

4 Nov, 2023 21:05 IST|Sakshi

డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750  సెమీఫైనల్‌.. ఒకవైపు భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు.. మరోవైపు స్పెయిన్ స్టార్‌ కరోలినా మారిన్‌. తొలి సెట్‌ నుంచే హొరా హోరీ పోటీ. వీరిద్దరూ మధ్య ఫైట్‌ బాక్సింగ్ ​కోర్టును తలపించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి సింధు ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌ మాత్రం బ్యాడ్మింటన్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అస్సలు ఏమి జరిగిందో ఓ లూక్కేద్దం.

తొలిసెట్‌ ఓ రణరంగం..
తొలిసెట్‌లో మొదటి పాయింట్‌ మారిన్‌ ఖాతాలో చేరింది. దీంతో మారిన్‌ అనందానికి హద్దులు లేవు. మారిన్‌ పాయింట్‌ సాధించిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్‌ జరుపుకుంది. సిందూ కూడా ప్రత్యర్ధికి తగ్గట్టే సంబరాలు జరుపుకుంది. సింధు కూడా పాయింట్‌ సాధించినా ప్రతీసారి బిగ్గరగా అరిచింది. 

మొదటి వార్నింగ్‌..
వీరిద్దరూ సెలబ్రేషన్స్‌ శృతిమించడంతో మొదటి సెట్‌లోనే అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరిని దగ్గరకి పిలిచి గట్టిగా అరవద్దూ అంటూ అంపైర్‌ హెచ్చరించాడు. దీంతో సింధు సైలెంట్‌ అయినప్పటికీ.. కరోలినాలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. తన పంథాను కొనసాగించింది.

తొలి సెట్‌లో ఓటమి.. 
మొదటి సెట్‌లో పీవీ సింధు చివరవరకు పోరాడినప్పటికీ కరోలినా ముందు తలవంచకతప్పలేదు. సింధు 18-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. 

రెండో సెట్‌లో విజయం..
రెండో సెట్‌లో సింధు  దెబ్బతిన్న పులిలా పంజా విసిరింది. ఈ సెట్‌ మొదటి నుంచే ప్రత్యర్ధిని సింధు ముప్పు తిప్పలు పెట్టింది. అయితే అనూహ్యంగా ప్రత్యర్ధి పుంజుకున్నప్పటికీ 21-19 తేడాతో సింధు విజయం సాధించింది.

మూడో సెట్‌లో వాగ్వాదం..
నిర్ణయాత్మమైన మూడో సెట్‌లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరోలినా పదే పదే గట్టిగా అరుస్తుండడంతో సింధు అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. మరోసారి కరోలినాకు అంపైర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అయినప్పటికీ కరోనా తీరు మారలేదు. చివరి గేమ్‌లో మొదటి నుంచే సింధుపై కరోలినా పై చేయి సాధించింది.

మారిన్ 9-2తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది.  సింధు సిద్ధంగా ఉండటానికి తగినంత సమయం ఇవ్వకుండా మారిన్ గేమ్‌ను వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా సింధు కోర్టులో ఉన్న  షటిల్‌ను తనవైపు తీసుకునేందుకు  ప్రయత్నించింది. 

దీంతో సింధుకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా వాదించుకున్నారు. ఈ క్రమంలో అంపైర్‌ జోక్యం ఇద్దరికి ఎల్లో  కార్డు చూపించాడు. అదే విధంగా మూడో సెట్‌ ఆఖరిలో షటిల్‌ను సింధు ముఖంపై కొట్టింది. వెంటనే కరోలినా తన బ్యాట్‌ను పైకెత్తి సారీ చెప్పినప్పటికీ.. సింధు వైపు మాత్రం చూడలేదు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అనవసర తప్పిదాలతో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ ప్రత్యర్థికి సమర్పించుకుంది. 7-21 తేడాతో సింధు ఓటమి పాలైంది.

క్షమాపణలు చెప్పిన కరోలినా..
ఇక ఈ మ్యాచ్‌ అనంతరం సింధుకు కరోలినా క్షమాపణలు చెప్పింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత పీవీ సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. అందులో "మ్యాచ్‌ ఓడిపోవడం బాధగా ఉంది. అయితే ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. కానీ బ్యాక్-టు-బ్యాక్ సెమీ-ఫైనల్‌కు క్వాలిఫై కావడం సాధించడం చాలా సంతోషంగా ఉంది. నా ఫిట్‌నెస్‌ కూడా మరింత మెరుగుపడింది. ప్రతీ ఒక్కరికి  భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఎదుటివారిని ద్వేషించడం సరికాదు " అంటూ ఆమె రాసుకొచ్చింది. 

ఈ పోస్టుకు కరోలినా స్పందిస్తూ.. "మ్యాచ్‌లో మంచి ఫైట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనమద్దిరం ఆ గేమ్‌లో గెలవాలని పోరాడాం. కానీ నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్‌ చేయాలనుకోలేదు. ఏదైమైనప్పటికీ అందరి ముందు నేను  ఈ విధమైన ప్రవర్తన చూపినందుకు క్షమించండి. త్వరలో మళ్లీ కలుద్దాం మిత్రమా అంటూ రిప్లే ఇచ్చింది.

మరిన్ని వార్తలు